
తెలంగాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. హెచ్ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న భారత్ సమ్మిట్‌లో 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు నిర్వహించనున్నారు. భారత్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు ఏర్పాట్లు చేశారు. ఫ్యూచర్ సిటీ, పట్టణీకరణపై చర్చలతోపాటు.. ఆర్థిక న్యాయం సామాజిక న్యాయం, సంక్షేమ విధానాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, ప్రపంచ దౌత్య సంబంధాలు, గ్లోబల్ సౌత్ సహకారంపై అలాగే.. ఏఐ, క్లౌడ్ క్యాపిటలిజం, కొత్త ఆర్థిక ఒప్పందంపై వరుస చర్చలు జరగనున్నాయి. భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీతోపాటు.. పలువురు ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగం చేయనున్నారు. కాగా.. భారత్ సమ్మిట్ పై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పించాయి.
కాగా.. భారత్ సమ్మిట్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. భారత్ సమ్మిట్ కాదు.. భారత వ్యతిరేక సమ్మిట్ అన్నారు. భారత అభివృద్ధి, రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే కుట్ర జరుగుతుందని.. మోదీపై తప్పుడు ఆరోపణలకు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నాని.. ఆయన విజన్ ఏంటో చెప్పాలన్నారు. దేశంలో పెట్టుబడులను అడ్డుకునేందుకే భారత్ సమ్మిట్.. నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ తీరుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగ విద్యార్థుల గొంతు నులిమినప్పుడు ఏమయ్యారు, లగచర్ల ఘటనపై ఎందుకు స్పందించలేదంటూ రాహుల్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. గిరిజన మహిళలను అవమానించినప్పుడు చలనం లేదు, హైడ్రాతో ఇళ్లు కూలుస్తుంటే ఢిల్లీలో నిద్రపోతున్నారా అని అడిగారు. హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై.. కేబీఆర్ పార్కు విధ్వంసంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. BRS ఎమ్మెల్యేల చేరికలపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, రైతులు, నేత కార్మికులు ఆత్మహత్యలపై మాట్లాడేందుకు సమయం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వఅవినీతిపై కాంగ్రెస్ నేతలే మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యముందా అని KTR అడిగారు.
భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు. భారత్ సమ్మిట్‌ను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యం, సమాజం, శాంతి కోసమే భారత్ సమ్మిట్ జరుపుతున్నామని చెప్పారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గిగ్ వర్కర్లకు ఏం చేసేది అనేది రేపు రాహుల్ చెబుతురని మంత్రులు పేర్కొన్నారు. నిత్యం విందులు, వినోదాల్లో తిరిగే వారికి భారత్ సమ్మిట్ అలాగే కనిపిస్తుందని.. ప్రజాస్వామ్యం, సమాజం, శాంతి కోసమే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలది రాహుల్‌గాంధీ స్థాయి కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాహుల్‌గాంధీ కాపాడుతున్నారని.. దేశాన్ని ఐక్యంగా ఉంచుతున్నందుకే.. బీజేపీ వాళ్లు భయపడుతున్నారని పొన్నం పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.