జస్ట్ 2 గంటల్లోనే.. హైదరాబాద్ టు బెంగళూరు.. ప్రకృతి ఒడిలో అడవుల గుండా ప్రయాణం..

హైదరాబాద్ టూ బెంగళూరు.. ఫ్లైట్ జర్నీ ఇక వేస్ట్.. కేంద్రం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో కేవలం రెండు గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. అదీ నల్లమల అడవులు, సోమశిల ప్రకృతి సోయగాల గుండా దూసుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైస్పీడ్ రైలు కారిడార్ తాజా రూట్ మ్యాప్, తెలంగాణలో వచ్చే ఐదు మోడ్రన్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం..

జస్ట్ 2 గంటల్లోనే.. హైదరాబాద్ టు బెంగళూరు.. ప్రకృతి ఒడిలో అడవుల గుండా ప్రయాణం..
Hyderabad To Bengaluru Bullet Train

Updated on: May 16, 2026 | 7:41 AM

హైదరాబాద్‌ – బెంగళూరు మహానగరాల మధ్య ప్రయాణాన్ని సమూలంగా మార్చేయబోతున్న ప్రతిష్ఠాత్మక హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టు పనులు వేగంగా కొలిక్కి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లలో ఒకటైన ఈ రూట్‌కు సంబంధించి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ లిమిటెడ్‌ చేపట్టిన ప్రాథమిక ఎలైన్‌మెంట్‌ సర్వే తుది దశకు చేరింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు మార్గం కోకాపేటలో మొదలై శంషాబాద్‌ మీదుగా నల్లమల అటవీ ప్రాంతాన్ని తాకుతూ.. ప్రకృతి సోయగాలకు ప్రతీకలైన మన్ననూరు, సోమశిల ప్రాంతాల మీదుగా వెళ్లేలా ప్రాథమిక రూట్‌ను ఖరారు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన రూట్‌కే మొగ్గు

తొలుత ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఈ కారిడార్‌ను శంషాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, కర్నూలు మీదుగా నిర్మించాలని భావించింది. అయితే మహబూబ్‌నగర్‌ వైపు ఇప్పటికే సాధారణ రైల్వే నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నందున, రైలు సదుపాయం లేని ప్రాంతాల మీదుగా ఈ ప్రాజెక్టును తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగానే శంషాబాద్, ఫోర్త్ సిటీ, మన్ననూరు-శ్రీశైలం మార్గం వైపు కేంద్రం మొగ్గు చూపింది. మన్ననూరు నుంచి సోమశిల మీదుగా ఈ ట్రాక్ ఏపీలోని కర్నూలుకు కలుస్తుంది. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు టైగర్‌ రిజర్వు పరిధిలోకి రావడం, ఘాట్‌ రోడ్డు మార్గం ఉండటంతో పర్యావరణ అనుమతులకు అనుగుణంగా సర్వే డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాథమిక సర్వే పూర్తయిన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదికరూపొందించనున్నారు.

తెలంగాణలో వచ్చే ఐదు హైస్పీడ్ స్టేషన్లు ఇవే

మొత్తం 607 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ తెలంగాణలో 205 కిలోమీటర్ల మేర సాగనుంది. రాష్ట్ర పరిధిలో ఐదు అత్యాధునిక బుల్లెట్ రైలు స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్‌గల్లు, మన్ననూరు, సోమశిల స్టేషన్లు ఉన్నాయి. కోకాపేట నుంచి శంషాబాద్‌ వరకు ట్రాక్ అలైన్‌మెంట్‌కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఒక ఆప్షన్, ORR వెలుపల నుంచి మరో ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారు.

విమాన ప్రయాణాలకు గట్టి పోటీ – రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుపై అత్యంత కీలకమైన విషయాలు వెల్లడించారు. గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల 8 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, సెక్యూరిటీ చెకింగ్, బోర్డింగ్ వంటి వాటికి 4 గంటల సమయం పడుతుంది. కానీ సిటీ సెంటర్లను కలిపే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. ఈ రూట్‌లో విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణానికే 99శాతం మంది మొగ్గు చూపుతారని, విమాన మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో మేడ్ ఇన్ ఇండియా భారత్ బుల్లెట్ ట్రైన్ సెట్స్ రకం రైళ్లను నడపనున్నారు. వీటిని బెంగళూరుకు చెందిన బీఈఎంఎల్ సంస్థ తయారు చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ పరిధిలో ఈ కారిడార్ల కోసం సుమారు 123 కిలోమీటర్ల మేర భూసేకరణ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ప్రారంభించి, ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు జీఎంఆర్ గ్రూప్, హెచ్ఎండీఏ, రైల్వే శాఖలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Follow Us