
హైదరాబాద్ మహానగర పరిధిలో మాంసం విక్రయాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 2న GHMC పరిధిలోని గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలు, అలాగే మాంసం, గోమాంసం విక్రయశాలలను మూసివేయాలని ఆదేశించింది.
GHMC జారీ చేసిన ప్రకటన ప్రకారం.. గాంధీ జయంతి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు అక్టోబర్ 2న వధశాలలు, మాంసం విక్రయ కేంద్రాలను పూర్తిగా మూసివేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆదేశాల ప్రకారం నగరంలో మటన్, చికెన్‌తో పాటు ఇతర మాంసం విక్రయ కేంద్రాలు కూడా అక్టోబర్ 2న కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోనున్నారు. అయితే GHMC సర్క్యులర్‌లో ప్రత్యేకంగా పేర్కొన్న వధశాలలు, మాంసం, గోమాంసం విక్రయశాలల మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరారు. మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో మూసివేతను అమలు చేయాలని సూచించారు.
గాంధీ జయంతి నేపథ్యంలో ప్రతి ఏడాది పలు ప్రాంతాల్లో మాంసం విక్రయాలపై ఇలాంటి ఆంక్షలు అమలు చేస్తుంటారు. ఈసారి కూడా అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని సంబంధిత మాంసం విక్రయ కేంద్రాలు మూసివేయాల్సి ఉండటంతో.. మాంసం కొనుగోలు చేసే వినియోగదారులు ముందుగానే తమ అవసరాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు GHMC CPRO కార్యాలయం ద్వారా అధికారిక సర్క్యులర్ విడుదలైంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..