Ganesh Chaturthi 2022: గణేష్ శోభాయాత్ర అంటే హైదరాబాద్ ఐకాన్. వినాయక నిమజ్జనాలు అతిపెద్ద ఈవెంట్. ఈసారి నిమజ్జనాలు ఎక్కడ చేస్తారు? హుస్సేన్ సాగర్ లో చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుందా? హుస్సేన్ సాగర్ లో కోర్టు ఇచ్చిన సూచనలు పాటించకపోతే.. మరి నిమజ్జనాలు ఎక్కడ చేయాలి? హుస్సేన్ సాగర్ కు ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న చెరువులు , కుంటల పరిస్థితి చూస్తే అధ్వాన్నంగానే కన్పిస్తోంది. అందుకే ఈసారి గణేషుడి నిమజ్జనాలు పై పెద్ద సందిగ్దం ఏర్పడింది. దేశంలో ముంబైకి సరిసమానమైన స్థాయిలో గణేష్ ఉత్పవాలు జరిగే ప్రాంతం హైదరాబాద్. శోభాయాత్ర సైతం హైదరాబాద్ లో ఒక ప్రత్యేకతే. 650 చదరపు కిలో మీటర్ల పరిధి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకులు ఒక శోభాయాత్రగా తరలివస్తారు. ప్రధానంగా ఈ విగ్రహాలన్నీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జం చేస్తారు. ఈ శోభాయాత్ర.. నిమజ్జనాలు హైదరాబాద్ నగరానికి ఒక ఐకాన్. అందుకే… ఒక్క హైదరాబాద్ లోని వారే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఈ నిమజ్జన యాత్ర చూసేందుకు వస్తుంటారు. మరి ఈ ఏడాది హుస్సేన్ సాగర తీరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ఉండవా? నీటి పొల్యూషన్ కి కారణమవుతోందని ప్రభుత్వం ఇప్పటి వరకూ నిమజ్జనాలకు హుస్సేన్ సాగర్ లో అనుమతి ఇవ్వలేదు. మరోవైపు సాగర్ లో నిమజ్జనాలు చేయాలంటే.. ప్రత్యేక మైన పాండ్స్ ఏర్పాటుచేసి.. సాగర్ నీరు మొత్తం విగ్రహాలతో నిండిపోకుండా చేయాలని కోర్టు సూచనలున్నాయి. మరి ఈ పరిస్థితుల మధ్య హైదరాబాద్ లో 30కి పైగా చెరువులు..కుంటలు… ప్రత్యామ్నాయం అవుతాయా? వాటి పరిస్థితి ఎలా ఉంది. గణేష్ ఉత్సవ కమిటీ ఏమంటోంది. హిందు వేదికలు ఏం డిమాండ్ చేస్తున్నాయి.
ఉస్సేన్ సాగర్… ఒకవైపు టాంక్ బండ్, మరోవైపు ఎన్టీఆర్ ఘాట్, ఇంకో వైపు నక్లెస్ రోడ్ లతో హైదరాబాద్ కు ఒక ప్రధానమైన టూరిస్ట్ ప్లేస్. గణేష్ నిమజ్జనాలకు శోభాయాత్రకు కేరాఫ్ అడ్రస్. అయితే.. కొన్ని సంవత్సరాలు హుస్సేన్ సాగర్ కాలుష్యానికి వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా ఒక కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కోర్టుకు వరకూ చేరిన విషయంలో న్యాయస్థానం హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వల్ల కాలుష్యం కాకుండా ప్రత్యేకమైన పాండ్స్ ఏర్పాటుచేసి.. వాటిలోనే విగ్రహాలు నిమజ్జనం చేసే చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పాండ్స్ ఏర్పాటు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కోర్టు ఆదేశాలు ప్రకారం .. పాండ్స్ ఏర్పాటు చేయకపోతే… నిమజ్జనాలకు అంగీకరించడం ఎలా అనే వాదన ప్రభుత్వం నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితులు మధ్య సాగర్ ఈ ఏడాది నిమజ్జనాలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
సాగర్ లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడం పై భాగ్యనగర్ ఉత్సన కమిటీతో పాటు వివిధ హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహాలు మట్టితోనే చేయాలనే వివాదం తర్వాత.. ఇప్పుడు నిమజ్జనాలు మరో వివాదంగా తెరపైకి వచ్చింది. అయితే కేవలం వినాయక విగ్రహాలు నిమజ్జనాలు వల్లనే హుస్సేన్ సాగర్ కాలుష్యం అయిందా? అని ప్రశ్నిస్తోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి.
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలను అడ్డుకోవడం అంటే.. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవడమే అంటున్నాయి మరికొన్ని హిందూ సంఘాలు. ఇది హిందూ పండుగలను టార్గెట్‌చేయడమే అంటున్నాయి. హుస్సేన్ కాలుష్యానికి అనేక పరిశ్రమలు కారణమవుతుంటే.. వాటిని విడిచిపెట్టి సంవత్సరంలో ఒక రోజున జరిగే గణేష్ నిమజ్జనాలను కారణంగా చూపించడమేమిటంటున్నారు హిందూ జాయింట్ యాక్షన్ అధ్యక్షుడు లలిత్ కుమార్.
మరి ఈఏడాది హుస్సేన్ సాగర్ లో అనుమతించకపోతే? ఈ ప్రశ్నే తీవ్ర వివాదంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ నిమజ్జనాల చేసి తీరుతామంటోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమటి. కోర్టు ఇచ్చిన పాండ్స్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం ప్రభుత్వంపైనా, స్ధానిక జిహెచ్ ఎంసీ పైనా ఉందంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జానాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి ప్రతినిధి శశిధర్.
హుస్సేన్ సాగర్ కాదని… ఇతర చెరువుల్లో కుంటల్లో ఏర్పాటు చేశామని చెబితే దీన్ని కూడా అంగీకరించేది లేదంటున్నాయి హిందూ ఐక్య సంఘాలు. నిమజ్జం అంటేనే ఒక సామూహిక కార్యక్రమం…దాన్ని డీసెంట్రలైజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటున్నారు. హిందువులుగా దేనికైనాసిద్దమవుతాయని.. ప్రతిఘటిస్తామంటున్నాయి విహెచ్‌పి, హిందు జాయింట్ యాక్షన్ లాంటి సంస్థలు.
ఇంతకీ… హుస్సేన్ సాగర్ లో నిమజ్జానాలు లేకపోతే… ప్రత్యామ్నాయాలుగా ఉన్న చెరువులు ఎలా ఉన్నాయి? నిమజ్జనాలకు ఇక్కడ ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఇవేప్రశ్నలు.. అక్కడ ఉండే పరిస్థితులు ఇప్పుడు మరింత రాద్దాంతానికి దారితీస్తున్నాయి.
హుస్సేన్ సాగర్ లో నిమజ్జానాలకు ఆల్ట్రన్నేటివ్ ఆలోచనలు అనేక సంవత్సరాలు గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో అనేక చెరువులను ప్రత్యామ్నాయంగాచూపిస్తున్నారు.కొన్ని చోట్ల నిమజ్జనాలు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాండ్స్ ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల బతుకమ్మ కుంటలే… నిమజ్జనాలకూ ఉపయోగిస్తున్నారు. కూకట్ పల్లి. మియాపూర్, ప్రగతినగర్, బాచుపల్లి, సికింద్రాబాద్, ఎల్బినగర్, సరూర్ నగర్ వంటి అనేక ప్రాంతాల్లో చెరువుల్లో నిమజ్జనాలు సాగుతున్నాయి. అయితే… ఇప్పుడు చాలా చోట్ల చెరువులు ఎలా ఉన్నాయి . అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.
ప్రగతినగర్ చెరువు. నగరంలోని అతి పెద్ద చెరువుల్లో ఇది ఒకటి. ప్రగతి నగర్, మియాపూర్, మదీనా గూడ, జేఎన్టియు, బిహెచ్‌ఈఎల్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి గణేష్ నిమజ్జనాలు ఇక్కడ చేసే సంప్రదాయం ఉంది. కానీ ఈ చెరువు ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో కన్పిస్తోంది. నీరు లేదు. చెరువు చుట్టూ ఆక్రమణలు. ఉన్న నీటిలో కాలుష్యం కోలు చాచి వెంటాడుతోంది.
ఇక కూకట్ పల్లి ఐడిపిఎల్ చెరువు . కూకట్ పల్లి, బాలానగర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల నుంచి అనేక గణేష్ విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేస్తారు. కానీ ఈ చెరువులో నీళ్లు ఉన్నా.. కాలుష్యం వెంటాడుతోంది. చెరువులో నీరు పూర్తిగా కాలుష్యంలా కనిపిస్తోంది.మరోవైపు ఈ ప్రాంతం అంతా… ఫుడ్ కోర్టుల ఏరియాలా మారిపోయింది. ఈ వ్యర్థాలన్నీ.. ఈచెరువు చుట్టూ కాలుష్యంలా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నిమజ్జనాలు ఎలా సాగుతాయనే ప్రశ్నను లేవదీస్తున్నాయి.
ఇది ఫిలిమ్ నగర్ ప్రాంతంలోని కుంట. ఫిలిమ్‌నగర్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, దర్గా వంటి ప్రాంతాల నుంచి ఇక్కడ నిమజ్జనాలు చేస్తారు. కానీ ఈ కుంట పరిస్థితి భయంకరంగామారింది. ఇది ఒక డంపింగ్ యార్డ్ లా మారిపోయింది.
కొన్ని చెరువులు హుస్సేన్ సాగర్ తో సమానంగా గణేష్ నిమజ్జనాలకు కేరాఫ్ అడ్రస్. ఇందులో సరూర్ నగర్ చెరువు ఒకటి . అందుకే దీన్ని మినీ టాంక్ బండ్ అని పిలుస్తారు. కానీ 270 ఎకరాలకు పైగాఉండే ఈ చెరువు ఇప్పుడు కేవలం 60 ఎకరాలకు కుంచించుకుపోయింది. మరోవైపు నిండానీళ్లున్నట్లు కనిపిస్తున్నా..కనీసం విగ్రహాలు మునిగే పరిస్థితి లేదు.
హుస్సేన్ సాగర్ ఈ సారి నిమజ్జనాలకు కాదంటే… పరిసరరాల్లో ఉన్న చెరువులే ప్రత్యామ్నాయం. కానీ ఇవి కాలుష్యంతో నిండిపోతే… ఏంచేయాలి? ఇదే ప్రశ్నలు గణేష్ పందిళ్లు ఏర్పాటుచేసే భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే అనేక చెరువులు పూర్తికాలుష్యంతో నిండిపోయాయి. నిమజ్జనాలు చేసేలా కనీస వీటిని సంస్కరించే చర్యలు కూడా జిహెచ్ఎంసీ చేయడం లేదంటున్నారు. ఈ కాలుష్యాన్ని అనేక మంది భక్తులు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అయినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికి ప్రజాప్రతినిధులు కొందరు. ప్రజల, భక్తుల డిమాండ్ ను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు చేతులెత్తేస్తున్నారంటున్నారు గడ్డిఅన్నవరం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.
హుస్సేన్ సాగర్ తో పాటు చెరువులు … కాలుష్యానికి గణేష్‌నిమజ్జనాలు ఎలా కారణమవుతాయని ప్రశ్నిస్తున్నారు ఉత్సవాలు నిర్వహించే సంస్థలు..భక్తులు. నిమజ్జనాలు వల్ల నైనా..కొన్ని ప్రాంతాల్లో చెరువులు శుభ్రమవుతున్నాయని… మిగిలిన సమయాల్లో కాలుష్యానికి స్థానికి నీటి వనరులు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయంటున్నారు స్థానికులు. చెరువుల మెయింటినెన్స్ అనేదాన్ని పూర్తిగా మరిచిపోయి… వినాయక నిమజ్జనం వేళే వీటి పరిరక్షణ గుర్తుచేసుకోవడంపై గణేష్ విగ్రహాలు ఏర్పాటుచేసే కమిటీలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేస్తున్నాయి. చెరువుల్లో కాలుష్యం వెంటాడుతోంది.కనీసం ఈ నిమజ్జన సమయానికైనా నీటిని పూర్తి స్థాయిలో ఉంచడం కాలుష్యాన్ని నివారించడం లాంటి చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలా అనేక రూపాల్లో గణేష్ నిమజ్జనం చర్చకు దారితీస్తోంది. నిన్నటి వరరకూ విగ్రహాలు ఎత్తు.. దేనితో చేయాలనే చర్చలకు… శోభాయాత్ర, నిమజ్జనాలు ఎక్కడ చేయాలనే ప్రశ్నలు.. మరో కొత్త వివాదంగా నిలుస్తున్నాయి.
(గణేష్.వై. టివి9 తెలుగు, హైదరాబాద్)