Donkey Farming
-
-
గాడిదలు కాస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు తెలంగాణకు చెందిన ఓ యువకుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ప్రస్తుతం గాడిద పాలకు డిమాండ్ ఎక్కువుగా ఉండటం, వివిధ ఔషధాల తయారీలో గాడిద పాలు వాడటంతో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన అఖిల్ డాంకీ ఫార్మింగ్ మొదలు పెట్టాడు.
-
-
తెలంగాణలో మొదటిసారిగా డాంకీ ఫార్మింగ్ ప్రారంభించాడు అఖిల్. పశుపోషణలో భాగంగా దేశంలో గాడిదలను పెంచుతున్న మూడో వ్యక్తి కూడా. గతంలో పిల్లలు స్కూల్‌కి సరిగ్గా వెళ్లకపోవడం, లేదా సరిగ్గా చదవకపోతే పెద్దయ్యాక గాడిదలు కాస్తావ్ అనే సామెతను ఉపయోగించేవారు. కాని ఇప్పుడు గాడిదలు కాసి లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు కొందరు.
-
-
పశు పోషణలో భాగంగా గేదెలను, కోళ్లను, గొర్రెలను ,మేకలను, బాతులను, కుందేళ్లను వంటి రకరకాల జీవులను పెంచుతూ లాభాలు గడించడం చూశాం. వాటికోసం ప్రత్యేకంగా షెడ్లను వేసి పెంచుతారు. వీటి ద్వారా లభించే గుడ్లు, పాలు, మాంసాలను విక్రయించి వ్యాపారం చేస్తుంటారు. కానిప్పుడు గాడిదలను మేపుతూ ఆదాయం గడిస్తున్నారు. దీనికంతటికి కారణం డాంకీ మిల్క్‌కు డిమాండ్ ఉండటమే.
-
-
సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వీడియోలు చూసి ఇతర రాష్ట్రాల్లో బాగా సాగు చేస్తున్నటువంటి గాడిదల పెంపకాన్ని ఎంచుకున్నాడు అఖిల్. ఆలోచన రాగానే కుటుంబ సభ్యులతో చర్చించి డాంకీ ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో తన ఆలోచన కార్యరూపం దాల్చింది.ఒక్కో గాడిదను తీసుకురావడానికి 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు కాగా.. కొన్ని మేలు రకం జాతి గాడిదలను తీసుకొచ్చేందుకు లక్ష నుంచి రూ. 1.50 లక్షలు ఖర్చు అయింది.
-
-
ఒక లీటర్ గాడిద పాల ధర రూ. 4500 నుంచి 5 వేల వరకు పలుకుతుంది. తమ ఫామ్ దగ్గరికి ఎవరైనా వచ్చి పది మిల్లీలీటర్లు 20 మిల్లీలీటర్ల పాలు అడిగితే వాటిని 200 నుంచి 400 వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నాడు అఖిల్. ఈ ఫార్మ్‌లో పాలను చాలా వరకు ఔషధ పరిశ్రమలకు సరఫరా చేస్తూ ఆదాయం అర్జిస్తున్నాడు అఖిల్.
-
-
గాడిదల పోషణ చూసుకునేందుకు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చినట్లు అఖిల్ తెలిపాడు. మొత్తంగా 4 కుటుంబాల కూలీలు ఈ గాడిదల చూసుకోవడానికి ఉన్నారని వివరించాడు. ఎలాంటి పోటీతత్వం లేని బిజినెస్ చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చనే ఉద్దేశంతోనే ఈ తరహా వ్యాపారాన్ని తాము ఎంచుకున్నామంటున్నాడు అఖిల్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..