Water Supply: సమ్మర్‌లో తాగు నీటి కష్టాలకు చెక్‌.. తుది దశకు గోదావరి జలాల తరలింపు!

ఎల్‌నీనో ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌ నగరానికి తాగు నీటి అవసరాలను అందిస్తున్న సింగూరు- మంజీరా నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేసింది జలమండలి. రెండు రోజుల్లో గోదావరి అదనపు జలాల అనుసంధాన పనుల పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ గోదావరి జాలాల తరలింపు విజయవంతమైతే ఈ వేసవితో హైదారాబాదీలకు నీటి కష్టాలు తగ్గనున్నాయి.

Water Supply: సమ్మర్‌లో తాగు నీటి కష్టాలకు చెక్‌.. తుది దశకు గోదావరి జలాల తరలింపు!
Hyderabad Water Supply

Updated on: Nov 20, 2026 | 3:03 PM

హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా సింగూరు- మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి అదనపు జలాలను తరలించేందుకు జలమండలి చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఎంబీఆర్)కు గోదావరి జలాలను తరలించేందుకు చేపడుతున్న 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ- జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించారు. పనుల పురోగతి, సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.

అటవీ ప్రాంతంలో రాతి పొరలతో జాప్యం

వాస్తవానికి ఈ నెల 15 నాటికే పైప్‌లైన్ నిర్మాణం, అనుసంధాన పనులను పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, అటవీ ప్రాంతం గుండా వెళ్లే 150 మీటర్ల పైప్‌లైన్ మార్గంలో భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. దీంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాలేకపోయాయి. ప్రస్తుతం మిగిలిన పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని, రెండు రోజుల్లో అన్ని విధాలుగా పూర్తి చేసి, అనంతరం ట్రయల్ రన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఘన్‌పూర్ వద్ద జంక్షన్ పనులు పూర్తి

మరోవైపు ఘన్‌పూర్ ఎంబీఆర్ ప్రాంగణంలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు ఇప్పటికే అన్ని విధాలుగా పూర్తయ్యాయి. ఈ జంక్షన్ వినియోగానికి సిద్ధంగా ఉంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తయిన వెంటనే ట్రయల్ రన్ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సింగూరు–మంజీరా జలాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు- మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న దృష్ట్యా నగర తాగునీటి సరఫరాకు జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా సింగూరు- మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఏర్పడే లోటును సుమారు 50 శాతాన్ని గోదావరి అదనపు జలాలను తరలించి భర్తీ చేయనున్నారు.

పైప్‌లైన్ పనులను వేగవంతం చేయడంతోపాటు మిషన్ భగీరథ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. మిగిలిన సాంకేతిక పనులను పూర్తి చేసి, ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us