కొమురం భీం జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ ఫైర్ ఘటన కలకలం రేపింది. సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రజనీ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఎల్ఆర్ గన్ పేలడంతో రజనీ కుమార్ తల నుండి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే గుర్తించిన కౌటాల స్టేషను సిబ్బంది హుటాహుటిన రజనీకుమార్ ను కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ రజనీకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా.. ఆత్మహత్య యత్నం చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉదయం 5 గంటల సమయంలో హఠాత్తుగా గన్ పేలిన శబ్దాన్ని గుర్తించినట్టు కౌటాల పోలీస్ సిబ్బంది చెపుతున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన రజనీకుమార్ 13 బెటాలియన్ గుడిపేట లోని టీఎస్ఎస్పి కానిస్టేబుల్ . సెంట్రీ డ్యూటీలో భాగంగా కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం