హనుమకొండలో కాంగ్రెస్ వర్సెస్ BRS క్రెడిట్ ఫైట్ హై టెన్షన్ వాతావరణానికి దారి తీసింది. ప్రకటించిన సమయానికి బ్రిడ్జిపైకి చేరుకున్న ఎమ్మెల్యే తనపై విమర్శలు చేసిన BRS నేతలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వారిని చడ్డి గ్యాంగ్ తో పోల్చారు. ఆయనతో కలిసి వచ్చిన కార్యకర్తలు చీర, గాజులు, మంగళహారతులతో వచ్చి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరీ బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు..? ఎందుకు ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రియాక్ట్ అవలేదు..? అసలు గులాబీ సైన్యం రియాక్షన్ ఏంటి..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
హనుమకొండలోని నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణ రాజకీయ దుమారానికి దారితీసింది. మొదటి నుంచి క్రెడిట్ ఫైట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్సెస్ BRS క్రెడిట్ ఫైట్ నయీంనగర్ బ్రిడ్జి మీదకు చేరింది. టెన్షన్ వాతావరణానికి కారణం అయింది. మరోవైపు భారీగా తరలి వచ్చిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసిన వ్యాఖ్యల పై ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రా తేల్చుకుందాం.. అంటూ ఆదివారం(సెప్టెంబర్ 29) ఉదయం 10 గంటలకే డెడ్ లైన్ విధించడంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణ నెలకొంది.
నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణ పనులే రాజకీయ దుమారానికి కారణం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నాయిని రాజేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు నెలల వ్యవధిలో వెంటబడి బ్రిడ్జి నిర్మాణం, నాలా విస్తరణ పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ 5వ తేదీన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి జూలై నెలాఖరులోపు నిర్మాణం పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం నాలా విస్తరణ వల్ల ఈసారి హనుమకొండ ప్రజలు వరద ముంపు ముప్పు నుండి దాదాపుగా గట్టెక్కారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్థానిక వ్యాపారులు, ప్రజలు పుష్పాభిషేకం చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లినా పూలతో అభిషేకాలు చేసిన వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఈసారి ముంపు ముప్పు నుండి గట్టేక్కామని నాయిని కి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే మూడు రోజుల క్రితం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హనుమకొండలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. బ్రిడ్జి నిర్మాణానికి మా ప్రభుత్వ హయంలో డిజైన్ చేసి నిధులు కేటాయిస్తే, ఎమ్మెల్యే నాయిని తన క్రెడిట్ పొందుతున్నాడని విమర్శలు చేశారు. ఆ సందర్భంలోనే వాడెవడో పూలాభిషేకాలు చేయించుకుంటున్నాడని విమర్శించారు. కేటీఆర్ విమర్శలపై నాని రాజేందర్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ ఎవరిది..? మీరు నిర్మించారా..? లేక నేనా..? అక్కడే తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆదివారం ఉదయం 10 గంటలకు రావాలని, అదే బ్రిడ్జి పైన కుర్చీ వేసుకొని కూర్చుంటా రాళ్లు ఎవరికి పడతాయో పూలు ఎవరిపై పడతాయో చూసుకుందాం రావాలని సవాల్ విసిరారు. తన మంది మార్బలం, పార్టీ శ్రేణులతో 10 గంటలకు అక్కడ చేరుకున్నారు.
ప్రకటించిన సమయానికి ఎమ్మెల్యే నాయినీ రాజేందర్ రెడ్డి నయీం నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు కలిసి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చీర, గాజులు, మంగళహారతులు తీసుకొచ్చారు. రాకపోతే చీర గాజులు వస్తే హారతులతో స్వాగతం పలుకుతాం, ఈ బ్రిడ్జి ఎవరు కట్టారో ప్రజల మధ్య తేల్చుకుందామని సవాల్ విసిరారు నాయినీ. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. ఆ పార్టీకి చెందిన స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కూడా అందుబాటులో లేరు. ఆ పార్టీ తరఫున ఎవరు చర్చకు రాకపోగా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ నాయినీ రాజేందర్ రెడ్డి మాత్రం తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని బ్రిడ్జిపై కూర్చోని.. బ్రిడ్జి మే సవాల్ అన్నారు.
దాదాపు గంటకు పైగా నయీంనగర్ బ్రిడ్జిపై వెయిట్ చేసిన ఎమ్మెల్యే నాయినీ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు చెడ్డి గ్యాంగ్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..