బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. బెట్టింగ్ యాప్‌ల మోజులో మరో విద్యార్థి జీవితం బలి..

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో సుమారు రూ.2 లక్షలు పోగొట్టుకున్న విద్యార్థి చల్లా సంపత్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భారం, ఆర్థిక ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. బెట్టింగ్ యాప్‌ల మోజులో మరో విద్యార్థి జీవితం బలి..
Basara Iiit Student Suicide

Updated on: Nov 24, 2026 | 10:12 AM

బాసర (నిర్మల్ జిల్లా): బెట్టింగ్ ఉచ్చులో పడి చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. కొందరు అప్పులతో, మరికొందరు భయంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటూ .. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా.. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఈ విషాద ఘటన క్యాంపస్‌లో కలకలం రేపింది. మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చల్లా సంపత్‌గా గుర్తించారు.

విద్యార్థులు, సిబ్బంది తెలిపిన సమాచారం ప్రకారం.. సంపత్ ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో సుమారు రూ. 2 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆర్థిక ఒత్తిడి తీవ్రం కావడంతో ఇటీవల కాలేజీ ఫీజు చెల్లించాలనే కారణం చెప్పి తన పెద్దనాన్న వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. అంతేకాకుండా తన తల్లి విజయ బ్యాంకు ఖాతా నుంచి మరో రూ. 50 వేలు తీసుకున్నట్లు తెలిసింది. అప్పులు తీర్చే మార్గం లేక, బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయిన మనస్తాపంతో హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

తన కుమారుడికి స్నేహితులే బెట్టింగ్ అలవాటు చేశారని, వారి వల్లే ఈ దారుణం జరిగిందని మృతుడి తల్లి విజయ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి సంపత్ వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు సీజ్ చేసి విశ్లేషిస్తున్నారు. భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం తంగళ్లపల్లికి తరలించారు.

కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెడు అలవాట్లతోపాటు.. బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతుంటే, తక్షణ సహాయం కోసం టెలి-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ నంబర్ 14416 లేదా 1-800-891-4416 కు 24/7 ఉచితంగా కాల్ చేయవచ్చు. అత్యవసర వైద్య లేదా పోలీసు సహాయం కోసం 112 లేదా 100 కు వెంటనే కాల్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us