
హైదరాబాద్ మహానగరం పాతబస్తీలో భారీ సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జల్‌పల్లి ఫారెస్ట్ పార్క్ సమీపంలో రోడ్డు పక్కన పడేసి ఉన్న ఒక సంచిలో 500కు పైగా ఓటర్ ఐడీ కార్డులను స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ సంచిని అక్కడ పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఓటర్ ఐడీ కార్డుల సంచిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల అధికారులు, పోలీసులు ఈ కార్డులను పరిశీలించగా.. ఇవన్నీ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన ఓటర్ ఐడీ కార్డులుగా ప్రాథమికంగా గుర్తించారు. అసలు ఇన్ని వందల కార్డులు ఒకేచోట సంచిలో ఎందుకు ఉన్నాయి? వీటిని ఎవరు, ఏ ఉద్దేశంతో ఇక్కడ పడేశారు? అనే విషయాలు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నాయి.
ఎన్నికల సమగ్ర ఓటర్ జాబితా సవరణ కొనసాగుతున్న సమయంలో వందల ఓటరు కార్డుల దొరకడం కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఈ ఓటర్ ఐడీ కార్డులు రోడ్డుపైకి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పాతబస్తీలో ఒకేసారి ఇన్ని కార్డులు లభ్యం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..