ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పోర్టబుల్ ఫోన్ రూ.49,999కి విడుదలైంది. ఈ విభాగంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్ ఇదే. అలాగే మోటోరోలా రేజర్ 50 పోర్టబుల్ ఫోన్ రూ.64,999కు అందుబాటులో ఉంది. ఇక సామ్సంగ్ విడుదల చేసిన ఫోన్ రూ.90 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పోర్టబుల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి మోటారోలా, ఇన్ఫినిక్స్ మోడళ్లు అనుకూలంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ధర, ఇతర వ్యత్యాసాలను తెలుసుకుందాం.
మోటోరోలా రేజర్ 50 ఫోన్ 188 గ్రాముల బరువు, 7.25 ఎంఎం మందం ఉంటుంది. అంచులు, మూలాలు గుండ్రంగా ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ బరువు 195 గ్రాములు, మందం 7.25 ఎంఎం. దీని అంచులు ప్లాట్ గా ఉంటాయి. రెండూ తెలికపాటి ఫోన్లే కావడంతో సులభంగా ఉపయోగించవచ్చు.
ఇన్ఫినిక్స్ లో 3.64 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. అదే మోటోరోలా కు 3.63 అంగుళాల ఓలెడ్ ఎఫ్ హెచ్ డీ డిస్ ప్లే అమర్చారు. ఈ రెండింటిలో విజువల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. క్యాలెండర్, కెమెరా, వెదర్ తదితర వాటిని పరిశీలించుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ తదితర యాప్ లను చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ రెండు ఫోన్లలోనూ 120 హెచ్ జెడ్ రిఫ్రెస్ రేటుతో 6.9 అంగుళాల అంతర్గత డిస్ ప్లే ఆకట్టుకుంటోంది.
ఇన్ఫినిక్స్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఎక్స్ వోఎస్ 14పై పనిచేస్తుంది. అలాగే 15, 16 వెర్షన్ కు కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక మోటోరోలా విషయానికి వస్తే మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఎక్స్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తుంది.
ఇన్ఫినిక్స్ ఫోన్ లో 4720 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 70 వాట్ చార్జర్ తో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు. మోటోరోలాలో 33 వాట్ చార్జర్ కు మద్దతు
ఇచ్చే 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
ఇన్పినిక్స్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రైమరీ, 50 మెగా పిక్సల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఏర్పాటు చేశారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో మరో 50 మెగా పిక్సల్ కెమెరా అమర్చారు. మోటోరోలాలో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 32 మెగా పిక్సల్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి