
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కాలుష్యం నేపథ్యంలో సామాన్యుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాడు. అయితే బ్యాటరీ ధర ఎక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయడం ఒకప్పుడు భారంగా అనిపించేది. కానీ ఇప్పుడు BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) ప్రోగ్రామ్ ఈ కష్టాన్ని దూరం చేస్తోంది. బ్యాటరీని వాహనం ధర నుండి వేరు చేసి కేవలం సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో అందించడం ద్వారా స్కూటర్ల ప్రారంభ ధరలను కంపెనీలు సగానికి తగ్గించాయి.

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో 40 నుండి 50 శాతం ఖర్చు బ్యాటరీదే ఉంటుంది. BaaS విధానంలో కస్టమర్ స్కూటర్ బాడీని మాత్రమే తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బ్యాటరీ కోసం నెలకు కొంత మొత్తాన్ని లేదా కిలోమీటరుకు ఇంత అని చెల్లిస్తారు. దీనివల్ల ప్రారంభ పెట్టుబడి గణనీయంగా తగ్గి పెట్రోల్ స్కూటర్ల ధరకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ BaaS స్కూటర్లలో హీరో విడా VX2 గో అగ్రస్థానంలో ఉంది. కేవలం రూ.44,990 ఎక్స్ షోరూమ్ ధరతో లభించే ఈ స్కూటర్.. 92 కి.మీ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది. అదేవిధంగా టీవీఎస్ ఆర్బిటర్ V1 మోడల్ రూ.49,999 ధరకు అందుబాటులో ఉంది. ఇది 86 కి.మీ రేంజ్‌ను ఇస్తూ, తక్కువ బడ్జెట్‌లో విదేశీ స్థాయి టెక్నాలజీని సామాన్యులకు అందిస్తోంది.

మరోవైపు ఫ్యామిలీ అవసరాల కోసం చూసే వారికి టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా అద్భుతమైన ఎంపికలు. ఐక్యూబ్ BaaS మోడల్ రూ.59,999 నుండి ప్రారంభమవుతుండగా.. రిజ్టా రూ.75,999 ధరకు లభిస్తోంది. ఈ రెండు స్కూటర్లు భారీ స్టోరేజ్ స్పేస్, మెరుగైన భద్రతా ఫీచర్లు, సుదూర ప్రయాణాలకు అనువైన సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా రిజ్టాలో ఉన్న 56 లీటర్ల స్టోరేజ్ ఫ్యామిలీ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తోంది.

యువతను ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌తో వచ్చే ఏథర్ 450 సిరీస్ కూడా BaaS విధానంలో రూ.84,341 కే లభిస్తోంది. దీని గరిష్ట వేగం 90 కి.మీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తానికి అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో BaaS మోడల్ అనేది గేమ్ ఛేంజర్ కాబోతోంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను మరింత మందికి చేరువ చేస్తూ, పర్యావరణ హితమైన ప్రయాణానికి బాటలు వేస్తోంది.