
Usain Bolt Love Story: జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ జీవితంలో అత్యంత కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రపంచాన్ని తన వేగంతో అబ్బురపరిచిన ఈ ఒలింపిక్ ఛాంపియన్.. తన చిరకాల భాగస్వామి కాశీ బెన్నెట్‌కు పెళ్లి ప్రతిపాదన చేసి ఆశ్చర్యపరిచాడు. తన 40వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ ప్రపోజల్ ఇవ్వడం విశేషం. దీంతో 13 ఏళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమ బంధం ఇప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేసింది.
జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లోని వన్ బెల్మాంట్ రూఫ్‌టాప్ వేదికగా బోల్ట్ 40వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుక సందడిగా సాగింది. ఈ సందర్భంగా బోల్ట్ మోకాళ్లపై కూర్చొని కాశీ బెన్నెట్‌కు తన మనసులోని మాట చెప్పాడు.
అనంతరం ఆమె వేలికి ఏకంగా 5 క్యారెట్ల వజ్రపు ఉంగరం తొడిగాడు. ఊహించని ఈ ప్రపోజల్‌తో కాశీ ఆనందంలో మునిగిపోయింది. ఈ ప్రత్యేక క్షణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఉసేన్ బోల్ట్ జీవిత భాగస్వామిగా అడుగుపెట్టబోతున్న కాశీ బెన్నెట్ జమైకాకు చెందిన ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త, పరోపకారి. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు.
కాశీ ‘ఎలివేట్ మార్కెటింగ్ హౌస్’ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు, సామాజిక సంక్షేమం కోసం పనిచేసే ‘ప్రాజెక్ట్ కేస్’ అనే సంస్థకు వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. బోల్ట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. ఆమె తనకంటూ ప్రత్యేకమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు.
కాశీ బెన్నెట్ విద్యాపరంగానూ మంచి నేపథ్యం కలిగిన వ్యక్తి. ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించడంతో పాటు బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఒకవైపు వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
ఉసేన్ బోల్ట్, కాశీ బెన్నెట్ ప్రేమకథ దాదాపు 2013లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొదట్లో వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే 2016 రియో ఒలింపిక్స్ సమయంలో ఈ బంధం మరింతగా వెలుగులోకి వచ్చింది.
ట్రాక్‌పై బోల్ట్ సంచలన విజయాలు సాధిస్తున్న సమయంలో.. కాశీ అతడికి అండగా నిలిచారు. కాలక్రమంలో వీరి అనుబంధం మరింత బలపడింది.
13 ఏళ్ల బంధంలో బోల్ట్, కాశీ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. 2020లో వీరి తొలి సంతానం ఒలింపియా లైట్నింగ్ బోల్ట్ జన్మించింది. ఆ తర్వాత 2021లో కాశీ కవలలకు జన్మనిచ్చారు. వారి పేర్లు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్.
ఇలా ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన బోల్ట్, కాశీ.. తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కుటుంబానికి సంబంధించిన మధురమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటుంటారు.
ఆగస్టు 21న జరిగిన బోల్ట్ 40వ పుట్టినరోజు వేడుక సాధారణ బర్త్‌డే సెలబ్రేషన్‌గా మొదలై.. జీవితాంతం గుర్తుండిపోయే నిశ్చితార్థ వేడుకగా మారింది. చెకర్డ్ సూట్‌లో బోల్ట్ ప్రత్యేకంగా కనిపించగా.. కాశీ బంగారు, వెండి సీక్విన్ డ్రెస్‌లో మెరిశారు.
పుట్టినరోజు సందర్భంగా కాశీకి 5 క్యారెట్ల డైమండ్ రింగ్‌తో బోల్ట్ ఇచ్చిన సర్‌ప్రైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాక్‌పై ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ జమైకా దిగ్గజం.. వ్యక్తిగత జీవితంలోనూ ఓ కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడంటూ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..