Nikhat Zareen: ముస్లిం బాలికలకు నేను ప్రేరణగా ఉండాలని ఆశపడుతున్నాను: నిఖత్ జరీన్

|

May 25, 2022 | 1:55 PM

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి, ప్రపంచంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. బాక్సర్‌గా తన ప్రయాణం, అంతకుముందు పడిన కష్టాలను న్యూస్9 స్పోర్ట్స్‌తో పంచుకుంది.

Nikhat Zareen: ముస్లిం బాలికలకు నేను ప్రేరణగా ఉండాలని ఆశపడుతున్నాను: నిఖత్ జరీన్
Nikhat Zareen
Follow us on

ప్రపంచ వేదికపై సత్తా చాటి, విజయంతో తిరిగి రావడం కంటే నిఖత్ జరీన్‌( Nikhat Zareen)కు ఇంకేం పెద్ద బహుమతి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న మూస పద్ధతులను కూడా తన ఆటతో అధిగమించింది. ముఖ్యంగా, ఈ శారీరక క్రీడలో బాలికలు సమానంగా నైపుణ్యం కలిగి ఉంటారని నిరూపించడానికి ఈ నిజమాబాద్ ఛాంపియన్ బాక్సింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. ఆదిలో ఎన్నో కష్టాలు పడిన జరీన్.. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(World Championship )లో స్వర్ణం గెలిచి విమర్శకుల నోళ్లూ మూయించింది. ఈమేరకు న్యూస్9 స్పోర్ట్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన నిఖత్ జరీన్.. ఎన్నో విషయాలను పంచుకుంది.

బాక్సింగ్‌లో మీ ప్రయాణం ఎలా మొదలైంది?

2009కి ముందు, నేను రెండు సంవత్సరాలు అథ్లెటిక్స్ ఆడాను. 100మీ, 200మీటర్ల ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. నేను మా నాన్న దగ్గర శిక్షణ తీసుకున్నాను. కానీ సరైన సౌకర్యాలు లేవు. సరైన కోచ్ లేడు. బాక్సింగ్ మినహా అన్ని క్రీడలలో నేను అమ్మాయిలను గమనించాను. దీంతో మానాన్నను ఓ మాట అడిగాను. ‘పాపా, అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ ఆడరు? బాక్సింగ్ పురుషులకు మాత్రమేనా?’ అంటూ ప్రశ్నించాను. దానికి మానాన్న ‘లేదు బేటా, అమ్మాయిలకు బాక్సింగ్ చేసే ధైర్యం లేదని ప్రజలు అనుకుంటుంటారు’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అమాటను నేను తీవ్రంగా పరిగణించాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మొండిగా, బలంగా ఉన్నాను. ఆడపిల్లలు ఇలాంటి క్రీడను చేపట్టేంత దృఢంగా లేరని ప్రజలు ఎందుకు భావించాలి? అంటూ అనుకుంటుంటాను. అందుకే బాక్సింగ్‌లో చేరాలని, ఆడపిల్లలు కూడా ఈ క్రీడలో సత్తా చాటాలని అందరికీ చెప్పాలని కోరుకున్నాను. అదే విషయం మా నాన్నకు చెప్పాను.

పొరుగువారు, బంధువులు ఎలా చూశారు?

ఇది అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ, మా నాన్న చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే అతనో అథ్లెట్. అమ్మాయిని బాక్సింగ్‌లో ఎందుకు పెట్టారు, గాయం తగిలితే ఎవరు పెళ్లి చేసుకుంటారని మా నాన్నను బంధువులు, పొరుగువారు నిత్యం అడుగుతూనే ఉంటారు. కానీ, మా నాన్న ఎప్పుడూ వారిని పట్టించుకోలేదు. అతను నన్ను కష్టపడి పని చేయమని కోరారు. నేను దేశం తరపున పతకం గెలిచిన రోజు, వీరంతా వచ్చి నీతో ఫోటోలు దిగుతాంటూ ధైర్యమిచ్చాడు. అప్పటి నుంచి నేను వారిపై దృష్టి పెట్టడం మానేశాను. నేను ఏ పోటీల్లో పాల్గొన్నా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను.

మొదట్లో, మా జిల్లాలో నేనొక్కదాన్నే బాక్సర్‌ని. నేను అబ్బాయిలతో శిక్షణ పొందాను. నా మొదటి స్పారింగ్ సెషన్‌లో ఓ బాలుడు నన్ను శక్తివంతమైన పంచ్‌లతో కొట్టడం ప్రారంభించాడు. నాకు ముక్కు, కంటి నుండి రక్తం కారుతుంది. నన్ను అలా చూసి మా అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నా పట్టుదల చూసి, వారు మరింత ప్రోత్సహించారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను ఎంతో లక్కీ.

గాయం నుంచి ఎలా కోలుకున్నారు?

2017లో నేను గాయపడతానని లేదా గాయం కారణంగా ఒక సంవత్సరం పాటు బాక్సింగ్‌కు దూరంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేను దానిని అంగీకరించలేకపోయాను. ఇలాంటి సమయంలో నేను ఇక బాక్సింగ్ ఆడతానా? దేశం కోసం పతకం సాధిస్తానా? అనే ప్రశ్నలు నిత్యం నన్ను బలహీనంగా చేసేవి. భుజం దెబ్బతినడంతో చాలా బాధపడ్డాను. కానీ, మా అమ్మ, నాన్న మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. గాయం నుంచి కోలుకుని, మరలా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తానంటూ ధైర్యం నింపారు. ఆ సమయంలో కొంతమంది ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడారు. ‘ఆమె జూనియర్ ప్రపంచ ఛాంపియన్ కాబట్టి.. ఆమెకు స్పోర్ట్స్ కోటా ఉద్యోగం వస్తుంది. మీరు ఆమెను ఎందుకు కష్టపడుతున్నారు? ఆమె రిటైరయ్యి, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వనివ్వండి’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు.

మిగతావారికి అది సరిపోతుందేమో కానీ, నాకు మాత్రం కాదు. నేను చాలా కలలు కన్నాను. నా కెరీర్ కూడా ఇంకా అనుకున్నంతగా ఊపందుకోలేదు. నేను పతకాలు గెలవడానికి ట్రాక్‌లో ఉన్నట్లు భావించాను. కానీ, దురదృష్టవశాత్తు ఆ గాయం తగిలింది. నేను నన్ను బలంగా నమ్మాను. నేను ఒత్తిడికి గురైనప్పుడల్లా కళ్ళు మూసుకుని, లోతైన శ్వాస తీసుకుంటూ, ఆటలోకి తిరిగి వచ్చానని, మళ్లీ పతకాలు గెలుచుకున్నట్లు ఊహించుకున్నాను. దీంతో ఎంతో బలహీనమైన స్థాయి నుంచి బలంగా తిరిగి ఆటలోకి వచ్చాను.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఏకగ్రీవ నిర్ణయాలతో ఎలా గెలిచారు, దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

అన్ని బౌట్‌లను ఏకగ్రీవంగా గెలవాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రతి రౌండ్‌లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకున్నాను. ఆటలో పూర్తి సామర్థ్యం చూపిస్తే, ఉత్తమ ఫలితాలు వాటంతంట అవే వస్తుంటాయి.

స్వర్ణం గెలిచిన వెంటనే మీ స్పందన ఎలా ఉంది?

ఫైనల్‌లో, మొదటి రెండు రౌండ్‌లలో ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వాలని, మూడవ రౌండ్‌లో రిలాక్స్‌గా ఉండాలని నేను ప్లాన్ చేశాను. నేను మొదటి రౌండ్‌ను ఏకగ్రీవంగా గెలిచాను. రెండవది 2-3తో నా ప్రత్యర్థికి వెళ్ళింది. ముగ్గురు న్యాయమూర్తులు నా థాయ్ ప్రత్యర్థికి అనుకూలంగా, ఇద్దరు నాకు అనుకూలంగా స్కోర్ చేశారని నా కోచ్ తెలిపాడు. అయితే, ఇది ఆమెకు మూడవ రౌండ్‌లో ఏకగ్రీవ తీర్పు నిర్ణయంపై ప్రభావం చూపుతుందని అనిపించింది. నన్ను నేను 100% నమ్మాను. 5-0 తేడాతో గెలుస్తాను అని నాకు నేను చెప్పుకున్నాను. ఇక మూడవ రౌండ్ నిర్ణయం ప్రకటించబోతున్నప్పుడు నేను భయపడ్డాను. అదే సమయంలో నేను గెలుస్తానని నమ్మకంగానూ ఉన్నాను. నాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. అదే సమయంలో భావోద్వేగానికి గురయ్యాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాలనే నా కలను సాకారం చేసుకున్నాను. నా గురించి నేను గర్వపడ్డాను. నేను నా లక్ష్యాన్ని సాధించాను. ఫైనల్ చేరిన ఏకైక అమ్మాయిని (భారతదేశం నుంచి) నేనే. దేశానికి స్వర్ణం సాధించిపెట్టాల్సిన బాధ్యత నాపైనే ఉంది. ఆ ఆశను నెరవేర్చుకున్నాను.

టోక్యో ఒలింపిక్స్‌కు ముందు, మేరీకోమ్‌తో ట్రయల్స్ గొడవలు ఎంత వరకు ప్రభావం చూపించాయి?

టోక్యో ఒలింపిక్స్‌లో ట్రయల్స్‌లో ఓడిపోవడంతో కలత చెందాను. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం ప్రతి అథ్లెట్ కల. ఇంకో నాలుగేళ్ళు ఆగాలని అర్థమైంది. కాబట్టి బాధగా అనిపించింది. ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. బహుశా టోక్యో నా కోసం కాదని అనుకున్నాను. నేను నా ఓటమిని అంగీకరించాను. దానిని పాఠంగా తీసుకున్నాను. నేను రింగ్‌లో ఎక్కడ లోపాలు చేశానో నాకు తెలుసు. నేను దానిపై పని చేయడం ప్రారంభించాను. గతంలో జీవించడం, మన వర్తమానంతోపాటు భవిష్యత్తును పాడు చేస్తుంది.

ఒలింపిక్స్ ట్రయల్‌ను కోల్పోయిన తర్వాత, మీలో ఎలాంటి మార్పు వచ్చింది?

టోక్యో ట్రయల్స్ తర్వాత ప్రజలు నా గురించి మాట్లాడటం ప్రారంభించారు. మేరీ కోమ్‌ను సవాలు చేసిన అమ్మాయిని అంటూ పిలిచేవారు. కానీ, నేను అలా పేరు పొందాలనుకోలేదు. నేను నిఖత్ జరీన్, ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందాలనుకున్నాను. నేను ఎప్పుడూ బంగారమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ బంగారు పతకం నాకు చాలా అవసరమని, దాని కోసం కష్టపడాలని నాకు తెలుసు. అప్పుడే నేను ఎవరో ప్రపంచం గుర్తిస్తుంది.

మేరీపై ఓడినప్పుడు ఎలా అనిపించింది?

మేరీకోమ్‌ పట్ల నాకు విపరీతమైన గౌరవం ఉంది. నేను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా మేరీకోమ్. నేను ఆమెను ప్రేరణగా తీసుకున్నాను. మా మధ్య పోటీ ఉంటుందని లేదా ఇదంతా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అప్పుడు విషయాలు వేరే దిశలో జరిగాయి. నాకు బాధగా అనిపించింది. కానీ, నేను చెప్పినట్లుగా, అవన్నీ నన్ను మరింత బలంగా తయారు చేసుకోవడంలో సహాయపడ్డాయి. నేను ఇప్పటికీ ఆమెను గౌరవిస్తాను. ఆమె నన్ను అభినందించడానికి ట్వీట్ చేసింది (ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత).

ముస్లిం యువతులకు స్ఫూర్తిగా నిలవాలన్న మీ నాన్న కోరికను ఎలా తీసుకుంటారు?

నేను సనాతన సమాజం, సనాతన కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ ఆడపిల్లలు అంటే ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకోవాలని జనాలు అనుకుంటారు. అయితే, మా నాన్న అథ్లెట్ కావడంతో నాకు చాలా ప్రయోజనం కలిగింది. అథ్లెట్లు ఎలాంటి జీవితాన్ని గడుపుతారో ఆయన అర్థం చేసుకున్నాడు. బాక్సింగ్ గేమ్‌ను షార్ట్స్‌లో ఆడతారని, ఇస్లాంలో అలాంటివి నిషేధించారని చెప్పేవారు. కానీ, మా నాన్న వాళ్ళ మాట వినలేదు. అతను ఎప్పుడూ బాక్సింగ్‌పై దృష్టి పెట్టమని కోరేవాడు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల ఉండేది. నా కుటుంబం నన్ను ఆదరిస్తున్నప్పుడు, ఇతరులు చెప్పే దాని గురించి నేను ఎందుకు బాధపడాలి? అలాంటి వారికి నేనెప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇది అంత సులభం కాదు. కానీ, నేను చేశాను. ప్రస్తుతం ఆ వ్యక్తులే నా గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జీవితంలో సాధించాలనుకునే ముస్లిం అమ్మాయిలకు ప్రేరణగా ఉండాలనుకుంటున్నాను. ఆడపిల్లలు హిజాబ్‌లోనే ఉండాలని సనాతన సమాజం భావిస్తే… బాక్సింగ్ కూడా హిజాబ్‌ను స్వాగతిస్తోంది. అమ్మాయిలు హిజాబ్ ధరించి ఆడొచ్చు. మీ అభిరుచిని, మతాన్ని ఒకే సమయంలో అనుసరించడానికి మీకు గొప్ప అవకాశం లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..