
Wasted Talent in Cricket: అసాధారణ ప్రతిభ, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. కానీ కొందరు ఆటగాళ్లు అపారమైన నైపుణ్యం ఉన్నప్పటికీ కోపం, ఫిట్‌నెస్ లేకపోవడం, చెడు అలవాట్ల వల్ల తమ కెరీర్‌ను తమ చేతులతోనే నాశనం చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ అంతటి స్థాయికి చేరుకోవాల్సిన ప్రథ్వీ షా నుంచి వినోద్ కాంబ్లే వరకు ఇందుకు ఉదాహరణగా నిలిచారు.
భారత క్రికెట్ చరిత్రలో వినోద్ కాంబ్లే ఆరంభం ఒక సంచలనం. టెస్టుల్లో వరుసగా రెండు ద్విశతకాలు, మూడు శతాబ్దాలు బాదిన ఏకైక భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. చిన్న వయసులోనే వచ్చిన పేరు, డబ్బు అతడిని దారి తప్పించాయి. నైట్ లైఫ్, పార్టీల సంస్కృతికి అలవాటు పడి ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు కోచ్‌లతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల కెరీర్ ముగిసింది. మరోవైపు, స్వింగ్ బౌలింగ్‌తో లార్డ్స్ హానర్స్ బోర్డుపై పేరు సంపాదించిన ప్రవీణ్ కుమార్ కూడా అధికంగా మద్యం తాగడం, వీధి గొడవలు, అంపైర్లతో వివాదాల వల్ల క్రమశిక్షణ లేని ఆటగాడిగా ముద్రపడి కేవలం 25 ఏళ్లకే జట్టుకు దూరమయ్యాడు.
ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!
న్యూజిలాండ్ జట్టులో తదుపరి బ్రెండన్ మెక్‌కలమ్ అవుతాడని భావించిన జేసీ రైడర్ అద్భుతమైన టైమింగ్‌తో గుర్తింపు పొందారు. కానీ లేట్ నైట్ పార్టీలు, ఆల్కహాల్ అలవాటు వల్ల టీమ్ మీటింగ్స్‌కు రాకపోవడం, ఊబకాయం బారిన పడటంతో పాటు నిషేధిత డ్రగ్స్ వాడి ఆరు నెలల నిషేధానికి గురయ్యారు. చివరకు 29 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అలాగే పాకిస్తాన్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించిన అహ్మద్ షజాద్, పొగరుబోతు తనం, క్రమశిక్షణా చర్యలు, డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోవడం వల్ల 25 ఏళ్లకే జాతీయ జట్టు నుంచి శాశ్వతంగా దూరమయ్యారు.
2015 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫోక్నర్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ యూకేలో మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురికావడం, వెంటాడిన గాయాల వల్ల 27 ఏళ్లకే అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అలెక్స్ హేల్స్ బ్రిస్టోల్ నైట్ క్లబ్ వివాదం, డ్రగ్స్ టెస్ట్‌లో విఫలం కావడం వల్ల 2019 ప్రపంచకప్ బెర్త్ కోల్పోయారు. ఆ తర్వాత తిరిగొచ్చి 2022 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నా, క్రమశిక్షణా రాహిత్యం వల్ల సుదీర్ఘ కెరీర్‌ను సాగించలేకపోయారు.
ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
అండర్-19 ప్రపంచకప్ గెలిచి, తొలి టెస్టులోనే సెంచరీ చేసి ‘నెక్స్ట్ సచిన్’ అని ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2019లో దగ్గు మందు కోసం డాక్టర్ సలహా లేకుండా సిరప్ వాడటంతో యాంటీ డోపింగ్ పరీక్షలో దొరికిపోయి 8 నెలల నిషేధానికి గురయ్యాడు. నైట్ లైఫ్ డిస్ట్రాక్షన్స్, లావుగా మారడం, టెక్నికల్ సమస్యల వల్ల తీవ్రంగా విఫలమయ్యాడు. ప్రతిభ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే కెరీర్ ఎలా నాశనమవుతుందో చెప్పడానికి ఈ ఆటగాళ్లే నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..