
2025లో టీమిండియా ఏం సాధించింది.? ఎన్ని మ్యాచ్‌లు, ఎక్కడెక్కడ ఆడింది.! అనేది మనం చూశాం. ఇక 2026 సంవత్సరంలో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండబోతోంది.? ఏ దేశంతో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా. 2026లో కూడా టీమిండియాకు ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇవ్వనున్నారు.
2026 కొత్త సంవత్సరానికి గానూ భారత జట్టు షెడ్యూల్ జనవరిలో ప్రారంభమవుతుంది. తన తొలి సిరీస్‌ను స్వదేశంలో ఆడనుంది. జనవరి 11-18 మధ్య న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు.. ఆపై ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ జనవరి 21న ప్రారంభమై జనవరి 31 వరకు కొనసాగుతుంది. న్యూజిలాండ్ సిరీస్ ముగియగానే.. ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టనున్న టీమిండియా.. టైటిల్‌ను గెలుస్తుందో.. చూడాలి.. T20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరుగుతుంది.
2026 T20 ప్రపంచకప్‌ను ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.? ఐపీఎల్ 2026 సీజన్ మార్చిలో ప్రారంభమవుతుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు తమ ప్రతిభను ఈ టోర్నీలో చూపనున్నారు. IPL 2026 మ్యాచ్‌లు మార్చి నుంచి మే వరకు జరుగుతాయి.
ఐపీఎల్ తర్వాత, టీమిండియా ఆటగాళ్లు జూలైలో ఇంగ్లాండ్‌లో పర్యటిస్తారు. అయితే, ఈసారి పర్యటన టెస్ట్ సిరీస్ కోసం కాదు, వైట్-బాల్ సిరీస్ కోసం ఉంటుంది. భారత్ మొదట ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ఆడుతుంది. ఇది జూలై 1 నుంచి 11 మధ్య జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుంచి 19 మధ్య ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత, రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం ఆగష్టులో శ్రీలంకకు వెళ్లనుంది భారత జట్టు. అయితే, ఈ సిరీస్‌కు ఇంకా తేదీలను ప్రకటించలేదు.
భారత పురుషుల క్రికెట్ జట్టు 2026 సెప్టెంబర్ నెలలో అత్యధిక సిరీస్‌లు ఆడుతుంది. టీమిండియా మొదట 2026 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో.. తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ఆడనుంది. ఆపై వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్ ఉంటుంది. బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20లు కూడా ఆడనుంది. అదే సమయంలో, స్వదేశంలో, టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
2026 అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. భారత పురుషుల క్రికెట్ జట్టు అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, వీటి తేదీలు ఇంకా ప్రకటించలేదు.
డిసెంబర్ 2026లో టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ఆడుతుంది. దీనిలో 3 ODIలు, 3 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది. తద్వారా 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు నాలుగు టెస్టులు, దాదాపు 18 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.