Ranji Trophy : పిచ్ మీద ఉంది కొన్ని సెకన్లే..రెండో బాల్‎కే డకౌట్.. కెప్టెన్ సాబ్ మరి ఇంత దారుణమా ?

Ranji Trophy : టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రంజీ ట్రోఫీలో తన రీఎంట్రీని చేదు జ్ఞాపకంతో మొదలుపెట్టాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే పంజాబ్ జట్టులో చేరిన గిల్, సౌరాష్ట్రతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరి ఫ్యాన్సును నిరాశపరిచాడు.

Ranji Trophy : పిచ్ మీద ఉంది కొన్ని సెకన్లే..రెండో బాల్‎కే డకౌట్.. కెప్టెన్ సాబ్ మరి ఇంత దారుణమా ?
Shubman Gill

Updated on: Jan 22, 2026 | 3:51 PM

Ranji Trophy : రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా సౌరాష్ట్ర, పంజాబ్ జట్ట మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తన తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ కావడంతో పంజాబ్ భారీ ఆధిక్యం సాధిస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి రావడంతో పంజాబ్ స్ట్రాంగుగా కనిపించింది. గిల్ రాకతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను కూడా అతనికి అప్పగించారు. అయితే మైదానంలో సీన్ రివర్స్ అయింది. సౌరాష్ట్ర బౌలర్ల నిప్పులు చెరుగుతూ పంజాబ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.

ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ కనీసం సెటిల్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు. సౌరాష్ట్ర స్పిన్నర్ పార్థ్ భుత్ వేసిన అద్భుతమైన బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్ సున్నా పరుగులకే వెనుదిరగడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. గిల్‌ను అవుట్ చేసిన పార్థ్ భుత్ సామాన్యుడు కాదు. గతంలో ఒక ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన రికార్డ్ అతనికి ఉంది. నేహాల్ వధేరాను అవుట్ చేసిన వెంటనే, గిల్‌ను కూడా అవుట్ చేసి పార్థ్ పంజాబ్‌ను గట్టి దెబ్బ తీశాడు.

కేవలం 73 పరుగులకే పంజాబ్ తన ఐదు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. అంతకుముందు సౌరాష్ట్ర బ్యాటింగ్‌లో కూడా హర్‌ప్రీత్ బ్రార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ఇప్పుడు సౌరాష్ట్ర వంతు వచ్చింది. గిల్ లాంటి క్లాస్ ప్లేయర్ డకౌట్ అవ్వడం స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో గిల్ బిజీగా ఉంటాడని భావించినప్పటికీ, అతను దేశవాళీ క్రికెట్‌పై మక్కువతో ఈ మ్యాచ్‌కు వచ్చాడు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన జట్టును ముందుండి నడిపిస్తాడని ఆశించిన అభిమానులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనైనా గిల్ తన విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గిల్ వైఫల్యం వల్ల పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఫలితం స్పిన్నర్ల చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..