Team India : అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు దక్కితే.. ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్ దక్కినట్టేనా ?

Team India : భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపడితే , ఐపీఎల్ 2026 లో రాణించిన పంజాబ్ కింగ్స్ స్టార్స్ ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, సూర్యాంశ్ శెడ్గే, వైశాఖ్ విజయ్‌కుమార్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Team India : అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు దక్కితే.. ఈ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు లక్కీ ఛాన్స్ దక్కినట్టేనా ?
Shreyas Iyer

Updated on: Jun 04, 2026 | 3:36 PM

Team India : భారత టీ20 క్రికెట్ జట్టులో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒక్కసారిగా పడిపోవడంతో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్ రేసులో అందరికంటే ముందున్నారు. ఐపీఎల్ 2026లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చూపించిన గణాంకాలు అతనికి బాగా కలిసివచ్చేలా ఉన్నాయి. సాధారణంగా కొత్త కెప్టెన్ వస్తే తనకు నమ్మకమైన ఆటగాళ్లకు జట్టులో ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అయ్యర్ గనుక సారథి అయితే పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు టీమిండియా తలుపులు తెరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సంజూ శాంసన్‌కు పోటీగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్

టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మొదటి వరుసలో ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయంగా నిలకడ లేని ప్రదర్శన చేస్తుండటం ప్రభ్‌సిమ్రాన్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. ఐపీఎల్ 2026లో ప్రభ్‌సిమ్రాన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. అతను 13 ఇన్నింగ్స్‌లలో 42.50 సగటుతో, 168.87 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 510 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శాంసన్ నిలకడలేమితో సెలక్టర్లు అతనిపై పూర్తి నమ్మకంతో లేరు. కాబట్టి జట్టుకు ఒక అగ్రెసివ్ వికెట్ కీపర్-ఓపెనర్ అవసరమైతే, శ్రేయస్ అయ్యర్ నమ్మకం ఉన్న ప్రభ్‌సిమ్రాన్‌కు వెంటనే పిలుపు వచ్చే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా స్థానానికి ఎసరు పెడుతున్న సూర్యాంశ్ శెడ్గే

ప్రస్తుతం భారత టీ20 జట్టులో నంబర్ 6 లేదా 7 స్థానాల్లో మ్యాచ్‌లను ముగించే సరైన ఫినిషర్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ భారం తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గ్రాఫ్ పడిపోగా, శివమ్ దూబే కూడా నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇరుకైన పరిస్థితుల్లో జట్టును గెలిపించే ఒక పవర్‌ఫుల్ హిట్టర్ కోసం వెతుకులాట ప్రారంభమైంది. పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు సూర్యాంశ్ శెడ్గే ఐపీఎల్ 2026లో కేవలం 7 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, 39.50 సగటుతో 175.56 భీకరమైన స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్‌పై 29 బంతుల్లోనే 57 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ ఇతనిని ఫినిషర్‌గా చక్కగా ఉపయోగించుకున్నాడు కాబట్టి, టీమిండియాలో కూడా ఇతనికి డెబ్యూ ఛాన్స్ దక్కవచ్చు.

బుమ్రాకు అండగా డెత్ ఓవర్ల కింగ్ వైశాఖ్ విజయ్‌కుమార్

భారత జట్టు కేవలం జస్‌ప్రీత్ బుమ్రాపైనే డెత్ ఓవర్ల భారాన్ని ఎల్లకాలం వేయలేదు. ముప్పై ఏళ్లు దాటిన బుమ్రా వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయాలంటే ఒత్తిడిలోనూ ఖచ్చితమైన యార్కర్లు వేయగల మరో నమ్మకమైన బౌలర్ కావాలి. ఈ పాత్రకు పంజాబ్ కింగ్స్ పేసర్ వైశాఖ్ విజయ్‌కుమార్ సరిగ్గా సరిపోతాడు. ఐపీఎల్ 2026లో వైశాఖ్ 9 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీశాడు. అయితే అతని అసలు బలం డెత్ ఓవర్లలో వికెట్లు తీయడం. డెత్ ఓవర్లలో ఇతని వికెట్ టేకింగ్ సక్సెస్ రేట్ 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. గుజరాత్‌పై 3/34, సీఎస్‌కేపై 2/38 లాంటి ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని గెలుచుకున్న వైశాఖ్, అయ్యర్ కెప్టెన్ అయితే భారత పేస్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us