హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే.. లేడీ ప్లేయర్ గుర్తుపట్టడంతో..!
Fencer Akhila Fan Moment With Sanju Samson: సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వస్తే చుట్టూ సెక్యూరిటీ, అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. కానీ, భారత స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ మాత్రం ఎవరి కంటా పడకుండా, హెల్మెట్ ధరించి తిరువనంతపురం వీధుల్లో ఓ సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్లాడు అయితే, అంతర్జాతీయ ఫెన్సింగ్ ప్లేయర్ అఖిల అనిల్ ఆయన్ను క్షణాల్లో గుర్తుపట్టడంతో అక్కడొక అద్భుతమైన ‘ఫ్యాన్ మూమెంట్’ చోటుచేసుకుంది. ఆ ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Fencer Akhila Fan Moment With Sanju Samson: తలకి హెల్మెట్, సాధారణ బ్లాక్ టీ-షర్ట్, షార్ట్స్, భుజాన బ్యాగ్‌ప్యాక్‌తో ఒక వ్యక్తి తిరువనంతపురంలోని కౌడియార్ రద్దీ రోడ్లపై ఎవరికీ అనుమానం రాకుండా సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఉదయపు హడావుడిలో ఉన్న బాటసారులకు అతడొక సాధారణ పాదచారిలాగే కనిపించాడు. అయితే, అదే సమయంలో స్నేహితులతో కలిసి మార్నింగ్ టీ తాగడానికి వచ్చిన అంతర్జాతీయ ఫెన్సర్ అఖిల అనిల్ చూపు అతనిపై పడింది.
ఆ నడకలో, వ్యక్తిత్వంలో ఏదో పరిచయమున్న భావన కలగడంతో ఆమె ఒక్కక్షణం ఆశ్చర్యపోయింది. వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, అతని వైపు పరిగెడుతూ “చేట్టా…” (అన్నా) అని పిలిచింది. అతను వెనక్కి తిరిగి చూడకపోవడంతో, ఒక అవకాశంగా భావించి గట్టిగా “సంజూ చేట్టా…” అని పిలిచింది.
ఆ పిలుపుతో ఆ వ్యక్తి నడక ఆపి, వెనక్కి తిరిగి చిరునవ్వుతో “నన్ను గుర్తుపట్టేశారా?” అని అడిగాడు. హెల్మెట్ వెనుక ఉన్నది మరెవరో కాదు—టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. స్వదేశంలో ఎవరి కంటా పడకుండా, సాధారణ పౌరుడిలా ప్రశాంతంగా నడక సాగిస్తున్నారాయన. స్వయంగా దేశానికి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్ అయిన అఖిలకు ఇది ఒక మధురమైన ‘ఫ్యాన్ మూమెంట్’గా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత తిరువనంతపురంలోని తన ఇంటికి చేరుకున్న సంజూ, కుటుంబంతో సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత పనుల నిమిత్తం కౌడియార్ వీధుల్లోకి వచ్చిన సమయంలో ఈ ఊహించని కలయిక చోటుచేసుకుంది.
ఈ కలయిక గురించి అఖిల తన సంతోషాన్ని పంచుకుంటూ—”ఎంఎస్ ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత సంజూ చేట్టా నా ఫేవరెట్ క్రికెటర్‌గా మారారు. గతంలో కొన్ని కార్యక్రమాల్లో ఆయన్ను చూసినప్పటికీ, దగ్గరికి వెళ్లి మాట్లాడే లేదా ఫొటో అడిగే అవకాశం దక్కలేదు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా చూడగానే నేను వెంటనే గుర్తుపట్టాను. నా స్నేహితులు సందేహించినప్పటికీ, ఒకవేళ కాకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చినా ఫర్వాలేదని రిస్క్ చేసి ముందుకు వెళ్లాను. తీరా చూస్తే అది నిజంగానే సంజూ చేట్టా! నాకిదొక కలలా అనిపించింది” అని వివరించారు. అనంతరం వారిద్దరూ కాసేపు మాట్లాడుకుని, కలిసి సెల్ఫీ దిగింది.
View this post on Instagram
పతనంతిట్టకు చెందిన అఖిల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి. కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్, ఆసియన్ ఛాంపియన్‌షిప్స్, థాయిలాండ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించారు. స్పోర్ట్స్ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె, వాయనాడ్ స్పోర్ట్స్ కౌన్సిల్ కోచ్‌గా, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు కోచ్‌గా కూడా సేవలందించారు. 2025లో స్పోర్ట్స్ కోటా కింద స్థానిక స్వపరిపాలన శాఖలో (LSGD) క్లర్క్‌గా ఉద్యోగం పొందిన అఖిల, ప్రస్తుతం తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ డైరెక్టరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
