
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన, అలాగే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి ఏటా ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు గురించి అతను ఆడతాడా లేదా అనే విషయంపై మాట్లాడి మాట్లాడి తనకు విసుగొచ్చిందని మంజ్రేకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పూర్తిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, ధోనీ ఇష్యూని సీఎస్‌కే చాలా వరస్ట్‌గా హ్యాండిల్ చేసిందని విమర్శించాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ధోనీ పిక్క కండరాల గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి హోమ్ మ్యాచ్‌లో కూడా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీనిపై మంజ్రేకర్ మాట్లాడుతూ.. “ధోనీ భవిష్యత్తు గురించి చర్చించడం నా వల్ల కాదు, నాకా టాపిక్ మీద ఆసక్తి పోయింది. ధోనీ ఆడతాడా లేదా అనేది ఇప్పుడు అనవసరం. నిజం చెప్పాలంటే ప్రస్తుత ధోనీ.. ఒకప్పటి అతని ఆటతీరుకు కేవలం నీడ లాంటివాడు మాత్రమే. అతను వయసు పైబడిన ఆటగాడు, పైగా ఐపీఎల్ తప్ప మరే ఇతర ఫార్మాట్ క్రికెట్ ఆడటం లేదు” అని నిజాన్ని కుండబద్దలు కొట్టాడు.
ధోనీ లాంటి ఒక ఐకాన్ ప్లేయర్ చుట్టూ కథలు అల్లడం మానేసి, ప్రాక్టికల్‌గా ఆలోచించాలని చెన్నై టీమ్‌కు మంజ్రేకర్ ఒక కఠినమైన సలహా ఇచ్చాడు. “సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ సీజన్‌తో ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి. ఆటగాళ్లపై అతిగా ఎమోషన్స్ చూపించడం బంద్ చేయాలి. పాయింట్ల పట్టిక, ప్రస్తుత ఆటతీరు, జట్టు గెలుపు గుర్రాలపైనే దృష్టి పెట్టాలి. ధోనీని బలవంతంగా టీమ్‌లో ఇరికించాలని చూస్తే ఎలా? గత రెండు సీజన్లుగా అతను కేవలం చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అది అతని వ్యక్తిగత ప్రతిభకు నిదర్శనమే కావచ్చు, కానీ జట్టు మ్యాచ్‌లు గెలవడానికి అది సరైన పద్ధతి కాదు” అని మంజ్రేకర్ విశ్లేషించాడు.
భారత క్రికెట్‌కు, అలాగే సీఎస్‌కే ఫ్రాంచైజీకి ధోనీ చేసిన సేవలను తాను ఎప్పటికీ గౌరవిస్తానని మంజ్రేకర్ స్పష్టం చేశాడు. ధోనీ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ కెప్టెన్లలో ఒకడని కొనియాడాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేస్తూ.. “ఒకవేళ ఇదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తన ప్రైమ్ టైమ్‌లో ఉన్న ఎంఎస్ ధోనీ గనుక నడిపించి ఉంటే.. ఈ పాటికి సీఎస్‌కే దర్జాగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునేది. కానీ ప్రస్తుత మేనేజ్‌మెంట్ ధోనీ సెంటిమెంట్‌ను సరిగ్గా వాడుకోలేక మొత్తం టీమ్‌ను గందరగోళంలో పడేసింది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ చేతిలో ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు ఇప్పుడు ఇతరుల ఫలితాలపై ఆధారపడేలా మారాయని గుర్తు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..