
Musheer Khan : ఆత్మీయుడిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోవడం ఎవరికైనా కష్టమే. అలాంటిది ఆ బాధను గుండెల్లో దాచుకుని ఒక ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్‌లో ఆడటం అనేది అసాధారణమైన విషయం. ముంబై యువ ఆటగాడు ముషీర్ ఖాన్ సరిగ్గా ఈ సాహసమే చేశాడు. తన మేనమామ మరణించిన వార్త విన్నప్పటికీ, దానికి చలించకుండా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అంతేకాదు ఒత్తిడిలో ఉన్న తన జట్టును ఆదుకోవడానికి ఏకంగా సెంచరీ సాధించి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. ముషీర్ ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అక్కడే ఉండి అతడికి సపోర్టు ఇవ్వడం విశేషం.
ముంబై యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తన మేనమామను కోల్పోయిన బాధలోనూ క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడు. నవంబర్ 8న హిమాచల్ ప్రదేశ్‌తో జరగాల్సిన రంజీ మ్యాచ్ ప్రారంభానికి ముందు, ముషీర్ ఖాన్‌కు ఈ విషాదకరమైన వార్త అందింది. ఆ వార్త అతడిని తీవ్రంగా కలచివేసినప్పటికీ, మ్యాచ్ నుంచి దృష్టి మరల్చకుండా మైదానంలోకి అడుగుపెట్టాడు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా, ఆరంభం సరిగా లేదు. ఆయూష్ మ్హాత్రే, రహానే, సర్‌ఫరాజ్ ఖాన్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ల వికెట్లు కేవలం 73 పరుగులకే కోల్పోయింది.
ముషీర్ ఖాన్ అన్న టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్న సర్‌ఫరాజ్ ఖాన్ కూడా మేనమామ మరణ వార్తతో తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపించాడు. సర్ఫరాజ్ కేవలం 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. అయితే, అతని తమ్ముడు 20 ఏళ్ల ముషీర్ ఖాన్ మాత్రం ఈ బాధను పక్కన పెట్టి అద్భుతమైన నిలకడ చూపించాడు. అతను 162 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సహాయంతో 112 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
Rohit Sharma was watching the Mumbai's Ranji Trophy match today. [📸: Shamik from RevSportz] pic.twitter.com/WTXbpIvvCe
— Johns. (@CricCrazyJohns) November 8, 2025
ఈ సెంచరీ ఇన్నింగ్స్ సమయంలో ముషీర్ ఖాన్ ఐదో వికెట్‌కు సిద్ధేశ్ లాడ్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ముంబై జట్టును సంకట స్థితి నుంచి బయటపడేయడానికి సహాయపడింది. సెంచరీ సాధించిన తర్వాత ముషీర్ ఖాన్ తన భావోద్వేగాలను పంచుకున్నాడు. సెంచరీ సాధించిన తర్వాత మాట్లాడిన ముషీర్, చాలా కాలం తర్వాత వచ్చిన ఈ సెంచరీ తనకు ప్రత్యేకమని తెలిపాడు. మేనమామ మరణం గురించి మాట్లాడుతూ, తాను చాలా ఎమోషనల్‌గా ఉన్నానని, చిన్నప్పుడు మేనమామ ఒడిలో ఎలా ఆడుకునేవాడో గుర్తు చేసుకుని బాధపడ్డాడు. అతనితో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు.
ఈ రంజీ మ్యాచ్‌ను చూడటానికి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌కు వచ్చాడు. సాధారణంగా రోహిత్ ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. నవంబర్ 8న ముంబై జట్టుకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన రోహిత్, ముషీర్ అద్భుతమైన ప్రదర్శనను మైదానంలో కూర్చొని తిలకించాడు. రోహిత్ మద్దతు ముషీర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..