
MS Dhoni: ఐపీఎల్‌లో దాదాపు ఇరవై ఏళ్ల పాటు అభిమానులను అలరించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆటగాడిగా తన ప్రయాణానికి గుడ్ బై చెప్పారు. అయితే ఈ నిర్ణయం గురించి సీఎస్కే యాజమాన్యానికి నవంబర్ 17న మాత్రమే తెలిసిందని అనుకుంటే పొరపాటు. నవంబర్ 14న, అంటే రిటైర్మెంట్ ప్రకటనకు మూడు రోజుల ముందే జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ధోనీ తన నిర్ణయాన్ని చెప్పినట్లు సీఎస్కే సహ యజమాని రూపా గురునాథ్ వెల్లడించారు. ఐపీఎల్ 2027 కోసం ఆటగాళ్లను కొనసాగించడం, విడుదల చేయడం, కొత్త ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆ సమావేశంలో సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ ఆటగాళ్ల విడుదల జాబితాను చదువుతున్నారట. ఆ సమయంలో ధోనీ చాలా మెల్లగా స్పందిస్తూ.. బహుశా నా పేరును కూడా ఈ జాబితాలో చేర్చాలి అని చెప్పారట. ఈ మాటతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ధోనీ ఇంత సింపుల్‌గా తన ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని రూపా గురునాథ్ తెలిపారు. సీఎస్కే అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన వీడియోలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
ధోనీ తన నిర్ణయాన్ని చెప్పిన వెంటనే వీడియో కాల్ అకస్మాత్తుగా కట్ అయిందని రూపా గురునాథ్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి ధోనీతో మాట్లాడినట్లు తెలిపారు. మీరు వచ్చే సీజన్‌లో ఆడరనే విషయాన్ని ఇంటర్నెట్ కూడా తట్టుకోలేకపోయినట్లుంది అని సరదాగా వ్యాఖ్యానించారట. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ నవ్వుకున్నా.. ధోనీ ఇకపై మైదానంలో ఆడరనే విషయాన్ని అంగీకరించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని రూపా చెప్పారు.
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని రూపా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం తాను ధోనీని కలిసినప్పుడు.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడగలనో లేదో తనకు కచ్చితంగా తెలియదని చెప్పారట. జట్టుకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేనప్పుడు ఆడేందుకు ధోనీ ఇష్టపడరని రూపా వివరించారు. జట్టుకు 200 శాతం ఇవ్వలేనని అనిపిస్తే ధోనీ ఆడరు. జట్టుకు అడ్డంకిగా ఉండాలని ఆయన అనుకోరు అని ఆమె తెలిపారు. గత సీజన్‌లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడం కూడా ఆయన నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేతో అనుబంధం కొనసాగించిన ధోనీ.. రెండు సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడారు. ఆయన నాయకత్వంలో చెన్నై జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు గెలుచుకుంది. ఇప్పుడు ఆటగాడిగా తప్పుకున్నా.. సీఎస్కేతో బంధం మాత్రం కొనసాగనుంది. 2027 సీజన్ నుంచి జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నారు. యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచుతూ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..