
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సిక్సర్ల కింగ్ క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అసాధ్యమైన రికార్డును పట్టుమని 16 ఏళ్లు కూడా నిండని ఒక పసివాడు సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టిస్తూ, ఒకే సీజన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన గేల్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వినాశకరమైన బ్యాటింగ్‌కు మారుపేరు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ గేల్ 2012 సీజన్‌లో ఏకంగా 59 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. గత పద్నాలుగేళ్లుగా ఆ రికార్డును తాకడం ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న 15 ఏళ్ల 61 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తన 60వ సిక్సర్ బాదాడు. దీనితో గేల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఈ కుర్రాడు బద్దలు కొట్టాడు.
A 15-year-old just broke Chris Gayle’s record 🤯
Vaibhav Sooryavanshi is truly special 🩷
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/3EXl40fEJj
— IndianPremierLeague (@IPL) May 27, 2026
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న కీలకమైన పోరులో వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం లెక్కచేయకుండా మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం కొన్ని బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాకిబ్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అద్భుతమైన ఇన్-సైడ్ అవుట్ షాట్‌తో కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సాధించాడు. ఈ సిక్సర్‌తోనే అతడు ఈ సీజన్‌లో 60 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.
సాధారణంగా అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లే ఐపీఎల్ లాంటి ఒత్తిడితో కూడిన లీగ్‌లో రాణించడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది వైభవ్ ఈ సీజన్‌లో కేవలం సిక్సర్ల రికార్డే కాకుండా, అత్యంత పిన్న వయసులో 600 పరుగులు సాధించిన ఆటగాడిగా రిషభ్ పంత్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మైదానంలో అతడి షాట్ల ఎంపిక, బంతిని బాదే శక్తి చూస్తుంటే దిగ్గజ ఆటగాళ్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. విండీస్ పవర్‌ను తలపిస్తూ ఈ బీహార్ కుర్రాడు సిక్సర్లు బాదుతుంటే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోతోంది. రాబోయే కాలంలో భారత క్రికెట్‌ను శాసించే ఒక అద్భుతమైన హిట్టర్ దొరికాడంటూ క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.