RCB vs GT IPL 2026 Result: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోరు.. గుజరాత్‌ను చితక్కొట్టి ఫైనల్లోకి దూసుకెళ్లిన బెంగళూరు!

Royal Challengers Bengaluru vs Gujarat Titans Qualifier 1 Result, IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించి, ఫైనల్ చేరుకుంది. గుజరాత్ జట్టుకు అందించిన 255 టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంది.

RCB vs GT IPL 2026 Result: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోరు.. గుజరాత్‌ను చితక్కొట్టి ఫైనల్లోకి దూసుకెళ్లిన బెంగళూరు!
Rcb Vs Gt Result
Image Credit source: https://x.com/IPL/status

Updated on: May 26, 2026 | 11:48 PM

Royal Challengers Bengaluru vs Gujarat Titans Qualifier 1 Result, IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూపం ప్రదర్శించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో అతలాకుతలం చేసింది. పరుగుల వరద పారించిన బెంగళూరు బ్యాటర్లు ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేయగా, బౌలర్లు సైతం చెలరేగి గుజరాత్‌ను కుప్పకూల్చారు. ఈ ఏకపక్ష విజయంతో బెంగళూరు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది.

పరుగుల సునామీ సృష్టించిన ఆర్‌సీబీ బ్యాటర్లు..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరంభం నుంచే అద్భుతమైన భాగస్వామ్యం లభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ గుజరాత్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 33 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు సాధించారు.

మరోవైపు కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 43 పరుగులు చేసి పాటిదార్‌కు చక్కని సహకారం అందించారు. ఆఖరి ఓవర్లలో జితేష్ శర్మ కూడా మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు కావడం గమనార్హం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నారు.

చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్..

255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. పవర్‌ప్లేలోనే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫ్ఫీ, రసిఖ్ సలామ్ ధాటికి గుజరాత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 2 పరుగులకే క్లీన్ బౌల్డ్ కాగా, సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. కేవలం 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ తీవ్ర కష్టాల్లో పడింది.

ఈ దశలో రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేస్తూ బెంగళూరు బౌలర్లను ప్రతిఘటించాడు. తెవాటియా 43 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అవతలి వైపు నుంచి అతనికి సరైన మద్దతు లభించలేదు. బెంగళూరు బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ 3 వికెట్లతో చెలరేగగా, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ చెరో రెండు వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాసించారు. దీనితో గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈసారి కప్పు మనదే అంటూ ఆర్‌సీబీ అభిమానుల సంబరాలు..

ఈ ఘన విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. క్వాలిఫయర్ 1 లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్రదర్శించిన ఆల్రౌండ్ ప్రదర్శన చూసిన అభిమానులు, విశ్లేషకులు ఈసారి బెంగళూరుకు తిరుగులేదని, దశాబ్దాల కప్‌ కల ఈ సీజన్‌లో నెరవేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us