RCB vs GT : ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ ఫైట్.. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నోళ్లు ఈ ఏడుగురే

RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ గ్రాండ్ ఫైనల్‌లో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేయగల ఇరు జట్లలోని ఆ ఏడుగురు కీలక ఆటగాళ్లపై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.

RCB vs GT : ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ ఫైట్.. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నోళ్లు ఈ ఏడుగురే
ipl 2026 final rcb vs gt

Updated on: May 31, 2026 | 5:55 PM

RCB vs GT : క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తలో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథిగా తన మొదటి టైటిల్ కొట్టాలని కసిగా ఉంటే, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు ట్రోఫీలు గెలిచిన మూడో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. ఈ గ్రాండ్ ఫైనల్‌లో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేయగల ఇరు జట్లలోని ఆ ఏడుగురు కీలక ఆటగాళ్లపై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.

1. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో ఏకంగా 600 రన్స్ చేశాడు. ఈ ఏడాది గుజరాత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే 81 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎గా నిలిచాడు. క్వాలిఫయర్-1 లోనూ గుజరాత్‌పై 43 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో 200 పరుగుల ఛేజింగ్ కూడా అంత ఈజీ కాదు కాబట్టి, బెంగళూరు బ్యాటింగ్‌లో కోహ్లీ పాత్ర అత్యంత కీలకం కానుంది.

2. కెప్టెన్ శుభ్‌మన్ గిల్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్వాలిఫయర్-2 లో సెంచరీ బాది ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 722 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న గిల్, ఈ సీజన్‌లో ఆర్సీబీపై ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 77 రన్స్ మాత్రమే చేసి ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. క్వాలిఫయర్-1 లో కేవలం 2 రన్స్‌కే అవుట్ అయ్యాడు. ఈరోజు గుజరాత్ గెలవాలంటే కెప్టెన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడటం చాలా అవసరం.

3. కెప్టెన్ రజత్ పాటిదార్

బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మిడిలార్డర్‌లో జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్-1 లో అజేయంగా 93 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్‌ (SRH) పై కూడా 56 రన్స్ చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో మంచి ఊపుమీదున్నాడు. ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 486 రన్స్ చేసిన పాటిదార్, గుజరాత్ హోమ్ గ్రౌండ్‌లో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

4. సాయి సుదర్శన్

గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 710 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే, గత రెండు మ్యాచ్‌లుగా అతను ఊహించని విధంగా హిట్ వికెట్ రూపంలో అవుట్ అవుతుండటం గమనార్హం. క్వాలిఫయర్-2 లో హాఫ్ సెంచరీ చేశాక కూడా అదే తప్పు చేసి అవుట్ అయ్యాడు. ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అలాంటి తప్పులు చేయకుండా నిలకడగా ఆడాల్సి ఉంటుంది.

5. జోష్ హేజిల్‌వుడ్

ఆస్ట్రేలియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అనుభవం ఆర్సీబీకి ఈ ఫైనల్లో పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన గత 3 మ్యాచ్‌ల్లో ఇతనికి కేవలం 2 వికెట్లే దక్కాయి. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకుండా 56 రన్స్ ఇచ్చి చాలా ఖరీదైన బౌలర్‌గా మిగిలాడు. ఈరోజు అతను ఫామ్‌లోకి రావడం బెంగళూరుకు చాలా ముఖ్యం.

6. కగిసో రబాడా

గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడా ప్రస్తుతం ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా పేసర్ 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 28 వికెట్లు పడగొట్టి టాప్‌లో ఉన్నాడు. క్వాలిఫయర్-1 లో ఆర్సీబీపై 2 వికెట్లు తీసినప్పటికీ 54 రన్స్ సమర్పించుకున్నాడు. రబాడా పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో చాలా ప్రమాదకరమైన బౌలర్. ఇవాళ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్‌లను రబాడా ఎలా అడ్డుకుంటాడనేది మ్యాచ్‌కే హైలైట్‌గా మారనుంది.

7. భువనేశ్వర్ కుమార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ప్రధానాస్త్రంగా మారాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. అహ్మదాబాద్ గ్రౌండ్‌లోనే గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భువి 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫయర్‌లో కూడా గిల్‌తో పాటు మరో బ్యాటర్‌ను అవుట్ చేశాడు. ఈరోజు రబాడాను వెనక్కి నెట్టి మళ్లీ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే అవకాశం భువికి ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us