
Sai Sudharsan : టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్టార్ బ్యాట్స్‌మన్ అయిన సాయి సుదర్శన్ గాయపడ్డాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సుదర్శన్‌కు ఈ గాయం అయ్యింది. ఈ దెబ్బ కారణంగా నేటి నుంచి (అక్టోబర్ 15) ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై తమిళనాడు జట్టు తరపున సాయి సుదర్శన్ ఆడలేకపోవచ్చు. అయితే, అతడి గాయం అంత తీవ్రమైనది కాదని సమాచారం.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సుదర్శన్ తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, ఈ టెస్టు మూడో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి గాయమైంది. షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, వెస్టిండీస్ ఆటగాడు జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన షాట్ నేరుగా సుదర్శన్ ఛాతీకి బలంగా తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత అతడు వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో మిగిలిన సమయమంతా ఫీల్డింగ్‌కు రాలేదు. అయినప్పటికీ, నాలుగో రోజు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సుదర్శన్ గాయం తీవ్రమైనది కానప్పటికీ, ముందు జాగ్రత్తగా తొలి రంజీ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సాయి సుదర్శన్ ప్రదర్శన పర్వాలేదనిపించింది. మొదటి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన అతను కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, రెండో టెస్టులో మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 126 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. కాగా, సుదర్శన్‌ను ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన టీ20 లేదా వన్డే స్క్వాడ్‌లలో దేనిలోనూ సెలక్ట్ కాలేదు.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ నేటి నుంచే అంటే అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. సాయి సుదర్శన్ ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడు జట్టును గ్రూప్ Aలో ఉంచారు. ఈ గ్రూప్‌లో నాగాలాండ్, ఒడిశా, డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ, ఆంధ్రా, ఉత్తరప్రదేశ్, బరోడా జట్లు కూడా ఉన్నాయి. తమిళనాడు జట్టు చివరిసారిగా 1987-88లో రంజీ ట్రోఫీ గెలిచింది. వెస్టిండీస్ సిరీస్‌లో భారత జట్టులో ఉన్న ఎన్. జగదీశన్ త్వరలో తమిళనాడు జట్టులో చేరవచ్చు, కానీ గాయం కారణంగా సుదర్శన్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..