
Highest Dot Balls Test Cricket: క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్ల వ్యూహాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 2014 నుంచి గత పుష్కర కాలంలో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన దిగ్గజాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో పేసర్ల ఆధిపత్యం కొనసాగుతుండగా.. మన భారత స్పిన్నర్లు సైతం అదరగొట్టారు.
క్రికెట్ విశ్లేషణలో డాట్ బాల్స్ పాత్ర ఎంతో కీలకం. 2014లో యూఏఈ వేదికగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్ నుంచి బౌలర్ల వ్యక్తిగత గణాంకాలైన డాట్ బాల్స్, బౌండరీల డేటా అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 486 టెస్టుల ఆధారంగా ఈ ఆసక్తికరమైన జాబితాను రూపొందించారు. ఈ గణాంకాలలో జస్‌ప్రీత్ బుమ్రా, కగిసో రబడ, జోష్ హాజిల్‌వుడ్ లాంటి ఆధునిక బౌలర్ల పూర్తి కెరీర్ కవర్ కాగా.. జేమ్స్ అండర్సన్, ఆర్ అశ్విన్ లాంటి సీనియర్ల కెరీర్ చివరి దశ మాత్రమే నమోదైంది. కనీసం 500 ఓవర్లు బౌలింగ్ చేసిన వారిని మాత్రమే ఈ జాబితాకు ఎంపిక చేయడం గమనార్హం.
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి కెరీర్‌లో ఏకంగా 81 శాతానికి పైగా డాట్ బాల్స్ నమోదు కావడం విశేషం. అంటే, ప్రతి ఓవర్‌లో దాదాపు ఐదు బంతులకు బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. పాకిస్థాన్ మీడియం పేసర్ మహ్మద్ అబ్బాస్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సైతం ఫిలాండర్‌కు అత్యంత చేరువలో నిలిచి సత్తా చాటారు. అబ్బాస్ 80.8 శాతం, గ్రాండ్‌హోమ్ 80.7 శాతం డాట్ బాల్స్ వేశారు. ఆ తర్వాత స్థానంలో ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ కొనసాగుతున్నాడు.
అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే ఆద్యంతం మీడియం పేసర్లు, ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యమే స్పష్టంగా కనిపిస్తోంది. కైల్ జేమీసన్ 80.5 శాతం, మహ్మద్ ఆమిర్ 79.0 శాతంతో సత్తా చాటారు. భారత పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా 78.9 శాతం డాట్ బాల్స్‌తో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వెస్టిండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ సైతం 78.8 శాతంతో బుమ్రాకు గట్టి పోటీ ఇస్తున్నారు. మరో భారత పేసర్ ఇషాంత్ శర్మ 78.2 శాతంతో ఈ లిస్ట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
సాధారణంగా టెస్టుల్లో పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎక్కువ పరుగులు ఇస్తుంటారు. ఈ జాబితాలో సైతం మీడియం పేసర్ల హవానే ఉన్నప్పటికీ.. భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ మార్క్ చూపించారు. స్పిన్నర్ల విభాగంలో అత్యుత్తమ డాట్ బాల్ శాతం నమోదు చేసిన బౌలర్లుగా వీరు సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఏకంగా 75 శాతానికి పైగా డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..