
Best ODI Playing XI : అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన హాషిమ్ ఆమ్లా, ఇటీవల వన్డే క్రికెట్ చరిత్రలో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ను ఎంచుకున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసిన ఆమ్లా తన జట్టులో మొత్తం ముగ్గురు భారతీయ ఆటగాళ్లకు చోటు కల్పించాడు. అయితే, వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసి, ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్-బాల్ క్రికెటర్‌గా పేరున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆమ్లా జట్టులో స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
దక్షిణాఫ్రికా దిగ్గజం హాషిమ్ ఆమ్లా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే ఫార్మాట్‌లో తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తన జట్టులో ప్రపంచ క్రికెట్ నుంచి దిగ్గజ ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ, రోహిత్ శర్మ లేకపోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. అంటే, హషీమ్ ఆమ్లా బెస్ట్ వన్డే టీమ్ నుంచి రోహిత్ శర్మను పక్కన పెట్టారు.
రోహిత్ శర్మ ప్రపంచంలో ఏ వైట్ బాల్ టీమ్‌కైనా సరిపోయే సత్తా ఉన్న ఆటగాడు అనడంలో సందేహం లేదు. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు రోహిత్ పేరు మీదే ఉన్నాయి. అయినప్పటికీ, హషీమ్ ఆమ్లా తన ఉత్తమ జట్టులో రోహిత్ శర్మను కాకుండా మరెవరిని ఎంచుకున్నారో చూద్దాం.
హషీమ్ ఆమ్లా ఎంచుకున్న బెస్ట్ వన్డే XI:
హషీమ్ ఆమ్లా శుభాకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌లో తన బెస్ట్ వన్డే టీమ్‌ను ఎంచుకున్నారు. ఓపెనర్లుగా భారతదేశం నుంచి సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా నుండి ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను జట్టులోకి తీసుకున్నారు. మూడవ స్థానం కోసం ఆయన విరాట్ కోహ్లిని ఎంచుకున్నారు. నాల్గవ స్థానం కోసం బ్రియన్ లారాను తీసుకున్నారు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సౌతాఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్‌కు చోటు ఇచ్చారు. ఆరవ స్థానం కోసం జాక్వెస్ కలిస్‌ను, ఏడవ స్థానంలో ఫినిషర్ పాత్ర కోసం ఎం.ఎస్. ధోనీని ఎంచుకున్నారు. బ్యాట్స్‌మెన్‌లను ఎంచుకోవడంలో ఎంత సంకోచం కనిపించినా, బౌలర్ల ఎంపిక విషయంలో హషీమ్ ఆమ్లా అంత స్పష్టంగా ఉన్నారు. ఆయన తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకున్నారు.
స్పిన్నర్లలో శ్రీలంక నుంచి ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా నుంచి షేన్ వార్న్‌కు చోటు కల్పించారు. ఫాస్ట్ బౌలర్‌లలో పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్‌తో పాటు తమ దేశ ఆటగాడు డేల్ స్టెయిన్‌ను తీసుకున్నారు.
హషీమ్ ఆమ్లా ఎంచుకున్న బెస్ట్ వన్డే XI: సచిన్ టెండూల్కర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, విరాట్ కోహ్లి, బ్రియన్ లారా, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ఎం.ఎస్. ధోనీ, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, డేల్ స్టెయిన్.