
IPL 2026 : క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగబోయే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్‌కు తెరపడనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖాయం చేసుకోగా.. మే 24తో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే కొంతమంది లెజెండరీ, స్టార్ క్రికెటర్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు కూడా ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వయసు పైబడటం, ఫామ్ లేమి, గాయాల కారణంగా ఐపీఎల్ 2026 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోయే ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
1. ఎంఎస్ ధోనీ
ప్రతి ఐపీఎల్ సీజన్ ముగిసేటప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించిన చర్చలు రావడం సర్వసాధారణం. కానీ ఈసారి సీన్ కాస్త సీరియస్‌గా మారింది. ఇటీవల సురేష్ రైనా.. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌లో కూడా ఆడతావా అని ధోనీని సరదాగా అడిగినప్పుడు, ధోనీ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌ను కలవరపెట్టింది. తన శరీరం ఇప్పుడు క్రమంగా బలహీనపడుతోందని, గాయాల తీవ్రత పెరుగుతోందని ధోనీ ఓపెన్‌గా ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం బొటనవేలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. ఈ సీజన్ తర్వాత గ్లోవ్స్ విప్పేసి అధికారికంగా వీడ్కోలు పలికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
2. అజింక్య రహానే
టీమిండియా క్లాస్ బ్యాటర్ అజింక్య రహానేకు ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ లోనే చేదు అనుభవం ఎదురైంది. మొదటి రౌండ్‌లో అతడిని ఎవరూ కొనకపోగా.. చివరి రౌండ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. ఆ తర్వాత కేకేఆర్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రహానే.. బ్యాటర్‌గా, లీడర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అది పూర్తిగా ఇతర జట్ల సమీకరణాలపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్‌గా మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన రహానే.. ఈ అవమానాల మధ్య వచ్చే సీజన్ కన్నా ముందే రిటైర్ అవ్వడమే బెటర్ అని భావిస్తున్నాడట.
3. సునీల్ నరైన్
ఈ జాబితాలో అందరినీ అత్యంత షాక్‌కు గురిచేస్తున్న పేరు కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే అతని తోటి విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ సడన్‌గా రిటైర్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే బాటలో 37 ఏళ్ల సునీల్ నరైన్ కూడా పయనిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న నరైన్.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడే, మంచి జ్ఞాపకాలతో లీగ్‌కు గుడ్‌బై చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు వెస్ట్ ఇండీస్ క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
4. ఇషాంత్ శర్మ
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ కెరీర్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఐపీఎల్ 2026 లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ఇషాంత్‌కు ఈ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. 2020 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లు కలిపినా ఇషాంత్ ఆడింది కేవలం 28 మ్యాచ్‌లు మాత్రమే. వయసు పెరగడం, కొత్త యువ బౌలర్ల దూకుడు ముందు ఇషాంత్ వేగానికి కాలం చెల్లింది. మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ దక్కని కారణంగా ఇషాంత్ ఈ సీజన్ ముగియగానే ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.
5. లియామ్ లివింగ్‌స్టోన్
ఇంగ్లాండ్ పవర్‌ఫుల్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు గత మూడు ఐపీఎల్ సీజన్లు ఒక పీడకలలా సాగాయి. గత 19 మ్యాచ్‌లలో అతను చేసింది కేవలం 238 పరుగులు మాత్రమే, బౌలింగ్‌లో తీసింది 5 వికెట్లు. అయినప్పటికీ ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఏకంగా రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ, ఈ సీజన్ మొత్తంలో అతను కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. గతంలో పంజాబ్ కింగ్స్ తనను రిలీజ్ చేయగానే గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లే.. వచ్చే సీజన్ కంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీ లివింగ్‌స్టోన్‌ను వదిలించుకుంటే, అతను కూడా ఐపీఎల్‌కు శాశ్వతంగా దూరం కావడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..