AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: అదంతా తూచ్.. నో ట్రేడ్.. ఆ ఇద్దరు ఢిల్లీ టీంతోనే ఉంటారు

IPL 2027: ఐపీఎల్ 2027కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మలను ట్రేడ్ చేయబోమని స్పష్టం చేసింది. ట్రేడింగ్ విండోను కూడా మూసివేసినట్లు సమాచారం. అయితే వచ్చే సీజన్‌లో జట్టుకు కెప్టెన్ ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, అక్షర్ పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. నవంబర్ 17లోగా రిటెన్షన్ జాబితా సమర్పించాలి.

IPL 2027: అదంతా తూచ్.. నో ట్రేడ్.. ఆ ఇద్దరు ఢిల్లీ టీంతోనే ఉంటారు
Axar Patel
Rakesh
|

Updated on: Nov 10, 2026 | 5:11 PM

Share

IPL 2027: ఐపీఎల్ 2027కు ముందు ఆటగాళ్ల బదిలీలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనసాగుతారా? వేరే జట్టుకు వెళ్తారా? అంటూ చర్చ జరుగుతున్న అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మ భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ ఇద్దరినీ ట్రేడ్ చేసే ఆలోచన లేదని ఢిల్లీ క్యాపిటల్స్ తేల్చినట్లు ఇండియా టుడే నివేదించింది. అంతేకాదు తమ ట్రేడింగ్ విండోను కూడా మూసివేసినట్లు సమాచారం. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు వచ్చే సీజన్‌లోనూ ఢిల్లీ జెర్సీలోనే కనిపించనున్నారు.

అక్షర్‌పై చెన్నై కన్ను.. ఆశుతోష్‌పై ఇతర జట్ల ఆసక్తి

గత కొన్ని వారాలుగా అక్షర్ పటేల్ పేరు చెన్నై సూపర్ కింగ్స్‌తో వినిపించింది. అతడి స్పిన్ బౌలింగ్, ఉపయోగపడే బ్యాటింగ్ నైపుణ్యాలు చెన్నైకి కలిసొస్తాయని ప్రచారం జరిగింది. మరోవైపు ఆశుతోష్ శర్మపై గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల ఆశుతోష్‌ను తీసుకోవాలని కొన్ని జట్లు భావించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఢిల్లీ తాజా నిర్ణయంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. ఇక ఈ ఇద్దరిని వేరే జట్టుకు పంపే ప్రసక్తే లేదని ఫ్రాంచైజీ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఢిల్లీ కెప్టెన్ ఎవరు?

అక్షర్ పటేల్ జట్టులో కొనసాగడం ఖరారైనప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు మరో కీలక ప్రశ్న ఉంది. 2026 సీజన్‌లో అక్షర్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఇప్పుడు రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తిరిగి ఢిల్లీకి రావడంతో కెప్టెన్సీ పోటీ ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ కూడా నాయకత్వ బాధ్యతలు చేపట్టగల ఆటగాడే. దీంతో 2027 సీజన్‌లో జట్టును ఎవరు నడిపిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్షర్‌ను జట్టులోనే ఉంచినంత మాత్రాన అతడికే కెప్టెన్సీ ఇస్తారని చెప్పలేం.

2026 ఐపీఎల్‌లో అక్షర్ పటేల్ 14 మ్యాచ్‌లు ఆడి 173 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 19.22 కాగా, స్ట్రైక్ రేట్ 131.06గా ఉంది. బౌలింగ్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు పడగొట్టి, ఓవర్‌కు 8.18 పరుగులు ఇచ్చాడు. మరోవైపు ఆశుతోష్ శర్మ కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 171 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 181.91గా నమోదైంది. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఆశుతోష్‌కు బలంగా మారింది. ఈ ప్రదర్శనల నేపథ్యంలో ఇద్దరినీ జట్టులోనే కొనసాగించాలని ఢిల్లీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ఇప్పటికే భారీ మార్పులు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రెండు కీలక ట్రేడ్లు పూర్తి చేసింది. లక్నో నుంచి రిషభ్ పంత్‌ను తీసుకుని, కుల్దీప్ యాదవ్‌ను ఆ జట్టుకు పంపింది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి జీషన్ అన్సారీని తీసుకుని, టీ న‌టరాజన్‌ను హైదరాబాద్‌కు పంపింది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య కూడా నలుగురు ఆటగాళ్ల మార్పిడి జరిగింది. లియామ్ లివింగ్‌స్టన్, జాక్ ఎడ్వర్డ్స్ చెన్నైకి వెళ్లగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టులో చేరారు. ఇక హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ మధ్య ప్రతిపాదిత ట్రేడ్‌కు ఇంకా అధికారిక ఆమోదం రావాల్సి ఉంది. ఐపీఎల్ 2027 కోసం ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను నవంబర్ 17లోగా సమర్పించాలి. మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us