AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ball Tampering: మళ్లీ తెర మీదకు బాల్ టాంపరింగ్ వివాదం.. ఆసిస్ బోర్డు షాకింగ్ నిర్ణయం

Ball Tampering: 2018 సాండ్‌పేపర్ బాల్ టాంపరింగ్ వివాదం ఉస్మాన్ ఖ్వాజా వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి వచ్చింది. జట్టులోని అందరికీ ఈ విషయం తెలుసని ఆయన తన ఆత్మకథలో పేర్కొన్నారు. డేవిడ్ వార్నర్ ఆయనకు మద్దతు తెలపగా, మిచెల్ స్టార్క్ తనకు ముందుగా తెలియదన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ మాత్రం పాత విచారణను మళ్లీ ప్రారంభించబోమని స్పష్టం చేశారు.

Ball Tampering: మళ్లీ తెర మీదకు బాల్ టాంపరింగ్ వివాదం.. ఆసిస్ బోర్డు షాకింగ్ నిర్ణయం
Usman Khawaja (1)
Rakesh
|

Updated on: Nov 10, 2026 | 2:29 PM

Share

Ball Tampering: 2018లో ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి ఆస్ట్రేలియా క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కొంతమంది ఆటగాళ్లకే బంతి ఆకృతిని మార్చే కుట్ర గురించి తెలుసని క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో తేల్చింది. అయితే ఆ జట్టులోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసని మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా తన ఆత్మకథలో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఆరోపణలపై మళ్లీ విచారణ జరపాలని డిమాండ్లు వస్తున్నా, క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. బోర్డు చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ తాజా ప్రకటనతో ఈ వివాదం మరోసారి వేడెక్కింది.

మళ్లీ విచారణ ఉండదన్న క్రికెట్ ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. 2018 ఘటనపై మరోసారి విచారణ ప్రారంభించడానికి బలమైన కారణం కనిపించడం లేదన్నారు. అప్పట్లో సేకరించిన వివరాల ఆధారంగా చేసిన విచారణ ఫలితాలపై బోర్డు ఇప్పటికీ నమ్మకంతో ఉందని తెలిపారు. ఖ్వాజా తన పుస్తకంలో చెప్పిన అంశాలను కూడా పరిశీలించినప్పటికీ, అప్పటి జట్టులోని ఇతరుల వాదనలకు ఆయన వివరాలు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ విచారణ చేపట్టినా కొత్తగా ఏమీ తేలే అవకాశం లేదని బోర్డు భావిస్తోంది.

డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికీ తెలుసన్న ఖ్వాజా

ఉస్మాన్ ఖ్వాజా తన ఆత్మకథ సబ్ర్‎లో సాండ్‌పేపర్ వివాదంపై పలు విషయాలు బయటపెట్టారు. 2018లో సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు సందర్భంగా బంతి ఆకృతిని మార్చే ప్రయత్నం గురించి జట్టులోని అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం కేవలం బ్యాటర్లు, బౌలర్లకే పరిమితం కాలేదని, సహాయక సిబ్బందికి కూడా తెలుసని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే అప్పటి విచారణలో మాత్రం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లకే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేల్చారు.

ఖ్వాజా వ్యాఖ్యలకు వార్నర్ మద్దతు

ఖ్వాజా చేసిన వ్యాఖ్యలకు మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఆయన చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజమని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, అప్పట్లో జరిగిన విచారణ హడావుడిగా ముగించారని, సరైన పద్ధతిలో జరగలేదని విమర్శించారు. బాన్‌క్రాఫ్ట్ పక్కనే ఖ్వాజా కూర్చున్నప్పటికీ, విచారణలో ఆయన వాంగ్మూలం తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని వార్నర్ అన్నారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని, బాధ్యతతో పాటు పారదర్శకత కూడా ఉండాలని ఆయన కోరారు.

మాకు ముందుగా తెలియదు

మరోవైపు ఖ్వాజా ఆరోపణలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించారు. బంతి పరిస్థితిని మార్చేందుకు బయట నుంచి ఏదైనా పదార్థాన్ని మైదానంలోకి తీసుకెళ్లిన విషయం తమకు ముందుగా తెలియదని 2021లో జట్టు బౌలర్లు విడుదల చేసిన ప్రకటనలో చెప్పిన మాటలకే తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. కేప్‌టౌన్ టెస్టులో పెద్ద తెరపై దృశ్యాలు చూసిన తర్వాతే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. కేప్‌టౌన్‌కు ముందు జరిగిన టెస్టులోనూ సాండ్‌పేపర్ ఉపయోగించారన్న ఖ్వాజా వాదన తనకు అప్పుడే తెలిసిందని స్టార్క్ స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనపై అప్పటి ఆటగాళ్ల మధ్య భిన్నమైన వాదనలు మరోసారి బయటపడ్డాయి.

అసలు ఏం జరిగింది?

2018లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతిపై సాండ్‌పేపర్ ఉపయోగిస్తూ కెమెరాలకు చిక్కారు. బంతిని దెబ్బతీసి రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ తర్వాత అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. ఇప్పుడు ఖ్వాజా ఆరోపణలు, వార్నర్ మద్దతు, స్టార్క్ వివరణతో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే బోర్డు మాత్రం తాజా విచారణకు అంగీకరించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us