Yadagiri Gutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌..! బయటపడుతున్న నిర్మాణ నాణ్యత లోపాలు..

| Edited By: Surya Kala

Nov 07, 2024 | 1:00 PM

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫ్లోరింగ్ కుంగిపోయింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఆలయంలో నిర్మాణ నాణ్యతా లోపాలు బయటపడతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఫ్లోరింగ్ మరోసారి కుంగింది.

Yadagiri Gutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌..! బయటపడుతున్న నిర్మాణ నాణ్యత లోపాలు..
Yadadri Temple
Follow us on

తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట.తిరుమల పుణ్యక్షేత్రాన్ని తలపించేలా యదాద్రిని పునర్నిర్మించాలని గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది. దీంతో కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 1200 కోట్ల రూపాయలతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధానాయాన్ని పునర్నిర్మించింది. కొద్దిపాటి వానకే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో 50 మీటర్ల మేర రెండు అంగుళాల లోతు వరకు ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. గత ప్రభుత్వం 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేయడంతో ప్రధానాలయ ప్రాంగణం 4.20 ఎకరాలకు విస్తరించింది. ఈ ప్రాంగణంలో స్వామివారి ప్రధానాలయంతో పాటు సప్తగోపురాలను నిర్మించారు. ఆలయం దక్షిణ భాగంలోని ప్రాకార మండపంలో వేసవిలో భక్తుల కాళ్ల కింద వాడిన మ్యాట్లు, వంట చెరకు వేయడంతో చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు ఇసుక నిండిపోయి కోతులకు ఆవాసంగా మారింది. అదేవిధంగా రిటైనింగ్‌ వాల్‌కు ఒక చోట బండలు ఊడిపోయాయి.

ఆలయ పునర్మిర్నాణంలో భాగంగా ఆలయ దక్షిణ భాగంలో మట్టితో విస్తరించగా ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ (నల్లరాతి శిలలు) సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది. విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. రెండేళ్ల క్రితం కురిసిన కొద్దిపాటి వానకే ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బండలు దాదాపు 10 మీటర్ల మేర 3 ఇంచుల కిందకి కుంగాయి. రాతిబండలు తొలగించి మరమ్మత్తులు చేశారు. గట్టినేల వచ్చే వరకు బోర్‌వెల్‌తో రంధ్రాలు చేసి అందులో సిమెంట్, కాంక్రీట్‌తో నింపారు. వాటిపై బండలతో ఫ్లోరింగ్ వేశారు. మరమ్మత్తులు చేసి రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ ఫ్లోరింగ్ కుంగడంతోపాటు నాపరాళ్లు పగిలి మరోసారి నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ నిర్మాణ లోపాలు వలన ప్రధానాలయానికి ఎటువంటి డోకా లేదని అధికారులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..