ఆలయాల నగరం తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలోని అందమైన గ్రామం అలంగుడి. ఈ గ్రామం మన్నార్గుడికి సమీపంలోని కుంభ కోణం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర ఆలయం ప్రసిద్దిగాంచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం బృహస్పతి లేదా గురు గ్రహం.
ఈ ఆలయంలో ఆపత్సహాయేశ్వరారగా పేరుగాంచిన శివుని విగ్రహంతో పాటు పార్వతీదేవి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. పార్వతీ దేవిని ఏలావర్కుళలి లేదా ఉమై అమ్మాయిగా పుజిస్తారు. పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలకడలిని మధించడానికి ప్రయత్నించారు. మంధర పర్వతాన్ని కవ్వంగా.. వాసుకి అనే పాముని తాడుగా చుట్టి పాలకడలిని చిలికారు. మొదటగా హాలాహలం వచ్చింది. అప్పుడు లయకారుడైన శివుడు ప్రపంచాన్ని విషం నుంచి రక్షించడానికి ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచాడు. ఇలా శివుడు ప్రపంచాన్ని హాలాహల ప్రభావం నుంచి రక్షించడం వల్ల శివుడిని ఆపత్సహాయేశ్వరుడిగా భావించి పూజిస్తున్నారు. ఆపత్సహాయేశ్వర్ అంటే రక్షకుడు అని అర్ధం ఇలా ఈ క్షేత్రం అలంగుడిగా ప్రసిద్ధిచెందింది.
ఈ ఆలయంలో శివుడితో పాటు బృహస్పతిని పూజిస్తారు. ఎవరి జాతకంలోనైనా గురు దోషం ఉంటె దోష నివారణకు బృహస్పతి లేదా గురు గ్రహానికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం గురువు తన రాశిని మార్చుకునే సమయంలో ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. దురదృష్టం తొలిగించే దైవంగా గురువుకి పూజలను చేస్తారు. వర్షాలు కురవడం కోసం గురువుని ప్రార్ధిస్తారు. ప్రత్యెక పూజలను చేస్తారు. అయితే అలంగుడితో పాటు సమీపంలో ఇతర గ్రహాలకు సంబంధించిన ఆలయాలున్నాయి.
మిగిలిన 8 నవగ్రహాలకు సంబంధించిన ఆలయాల్లో శనీశ్వరుడు ఆలయం తిరునల్లార్ లో ఉంది. ఇక రాక్షస గురువు శుక్రుడు ఆలయం కన్జనూర్లో ఉంది. నవ గ్రహాలకు అధిపతి సూర్యనారాయణ ఆలయం సూర్యనారాయణ కోయిల్ ఉంది. ఇక బుధుడు ఆలయం తిరువెంకడులో రాహువు ఆలయం.. తిరునాగేశ్వరంలో ఉంది. ఇక చంద్రుడు ఆలయం తిన్గలూర్ లో ఉండగా కేతువు ఆలయం కీజ్పెరుమ్పల్లంలో ఉన్నాయి. అంటే గురు గ్రహం ఆలయంతో పాటు మిగిలిన గ్రహాల ఆలయాలు అలంగుడికి సమీపంలో ఉన్నాయి. దీంతో ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు ఉంటే ఈ అలంగుడికి ప్రత్యెక పూజల కోసం వస్తారు.
శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలోని శివ లింగం స్వయంభువుగా ఉద్భవించినట్లు భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో విఘ్నాలకధి పతి వినాయకుడు కలన్గమార్ కథా వినాయగర్గా పూజలను అందుకుంటున్నాడు. బృహస్పతి లేదా గురు భగవానుడిగా పేరుగాంచిన దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవతలను బాధ పెడుతున్న గజముఖాసురుడి బారి నుంచి వినాయకుడు కాపాడాడు. కనుక ఇక్కడ గణపతిని కలంగమార్ కథా వినాయగర్గా పుజిస్తారు. అంతేకాదు ఇక్కడే శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్వతీదేవి తపస్సు చేసిందట.. అందువలన ఈ ప్రాంతాన్ని తిరుమానమంగళం అని కూడా అంటారు.
కుంభకోణం, నీదమంగళం వరకూ రైలులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.