దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖ అమ్మవారి ఆలయాలను అలంకరించారు. అమ్మవారి కోసం మండపాలను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్న దేవి ఆలయాలను అలంకరించారు.. ఇతర ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లోని సింగ్‌పూర్ గ్రామంలో ఉన్న పురాతన కాళీమాత ఆలయంలో కూడా నవరాత్రి సన్నాహాలు జరుగుతున్నాయి. పాండవుల కాలం నాటి సింగ్‌పూర్ కాళి ఆలయంలో గర్భగుడిలో విఘ్నలకధిపతి గణేశుడు తన తల్లి కాళికాదేవితో కలిసి పూజలను అందుకుంటున్నాడు.
ముంబైలోని ముంబా దేవి ఆలయంలోని గర్భగుడిలో తల్లి తనయుడు కలిసి పూజలను అందుకుంటున్న ఆలయం షాడోల్‌లోని సింగ్‌పూర్ లో మాత్రమే ఉంది. ఈ ఆలయంలో ప్రధాన గుడిలో గణేశుడు తన తల్లి కాళీ కలిసి ఉంటాడు. ప్రధాన ఆలయ గర్భగుడిలో కాళికాదేవి విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ విగ్రహం మెడ వంకరగా.. నాలుక బయటికి వచ్చి ఉంటుంది. కాళికాదేవితో పాటు గణేశుడు నటరాజ ఆసనంలో అంటే నృత్య భంగిమలో ఉంటాడు. పాండవుల కాలంలో ఎనిమిది బాహువుల గణేశుడిని ప్రతిష్టించినట్లు ఆధారాలు ఉన్నాయి.
సింగ్‌పూర్‌లోని కాళీదేవి ఆలయ సముదాయం దాదాపు 24 ఎకరాలలో విస్తరించి ఉంది. ఆధ్యాత్మికతకు విశ్వాస కేంద్రంగా భాసిల్లుతోంది. ఆలయ సముదాయంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. పాండవులు నిర్మించిన పచ్చమఠ ఆలయం కూడా ఉంది. పాండవులు తమ వనవాస సమయంలో కేవలం ఒక రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఆలయం లోపల ఐదు ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్టించారని చారిత్రక కథనం.
పచ్చమాత ఆలయంతో పాటు సీతారాముల ఆలయం, శివాలయం కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రమేష్ ప్రసాద్ శర్మ అనేక విగ్రహాలను ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. హనుమంతుడి పెద్ద విగ్రహం, మహాకవి తులసీదాస్, పరశురాముడు, గరుణ్ మహారాజ్, శివ పార్వతి విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవతలకు కూడా రోజూ పూజలను అందుకుంటున్నాయి.
శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవరాత్రుల తొలిరోజు నుంచి దేవీ జాగరణ, ఛత్తీస్‌గఢ్ జానపద సంస్కృతి ఆధారంగా జానపద గీతాలు, మహిళలచే మహా ఆరతి, గిరిజన సంప్రదాయం ఆధారంగా శైల నృత్యంతో ఈ నవరాత్రి గర్భ మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. చివరగా దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు. అనంతరం చెడుపై మంచి గెలిచిన గుర్తుగా రావణుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు.
అయితే గత కొంతకాలం వరకూ ఈ ఆలయ అభివృద్ధి, నిర్వహణను స్థానిక ప్రజలే పరస్పర సహకారంతో చేసేవారు. అయితే ఆలయంలో కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి సహకారం పెరగడంతో ఆలయంలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయ సముదాయ సరిహద్దు, రెండు చివర్లలోని ద్వారాలు, నేల, సంవత్సరానికి రెండుసార్లు ఆలయ పెయింటింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు రానున్న 10 ఏళ్లలో ఆలయాన్ని గ్రాండ్ ధామ్‌గా అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్టు కమిటీ చెబుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.