
Kaal Bhairav Birth Story Telugu: పరమ శివుని ఉగ్ర, శక్తివంతమైన రూపమైన కాలభైరవుడి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కాలభైరవ జయంతిని జరుపుకుంటారు. దీనిని కాలభైరవ అష్టమి లేదా భైరవ అష్టమి (Kaal Bhairav Ashtami) అని కూడా పిలుస్తారు. 2026లో ఈ పండుగను డిసెంబర్ 1, మంగళవారం నాడు జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, కాలభైరవుడు కాలానికి అధిపతి, న్యాయానికి ప్రతిరూపం. భక్తులను భయం, ప్రతికూల శక్తులు, కష్టాల నుంచి రక్షించే దేవుడిగా ఆయనను కొలుస్తారు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి రక్షకుడిగా ఉండటంతో ఆయనకు ‘కాశీ కొత్వాల్’ అనే పేరు కూడా ఉంది. కాలభైరవుడి పేరు వినగానే అధర్మాన్ని, అహంకారాన్ని, దుష్టశక్తులను అంతం చేసే ఉగ్రరూపం గుర్తుకొస్తుంది. అయితే ఈ స్వామి ఎలా ఆవిర్భవించారు? బ్రహ్మదేవుడి ఐదో తలను ఎందుకు ఖండించారు? దీని వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది.
పురాణ కథనం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్పవారనే విషయంపై వాదించుకున్నారు. ఇద్దరూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిర్లింగానికి ఆది, అంతం కనుక్కోవాలని సవాలు విసిరాడు. దీంతో విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లగా, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైభాగాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ జ్యోతిర్లింగం ఆది, అంతాలు కనిపించలేదు.
విష్ణుమూర్తి తనకు జ్యోతిర్లింగం ఆది అంతాలు తెలియలేదని నిజాన్ని అంగీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే అహంకారంతో జ్యోతిర్లింగ శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా శివుడిని అవమానించేలా మాట్లాడాడు. దీంతో పరమశివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ సమయంలో శివుడి ఉగ్రరూపం నుంచి కాలభైరవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడి అహంకారాన్ని అణచివేయాలని శివుడు ఆదేశించడంతో, కాలభైరవుడు తన గోరుతో బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించాడు. ఇలా బ్రహ్మలోని అహంకారాన్ని అంతం చేసినట్లు పురాణగాథ చెబుతోంది.
బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించిన కారణంగా కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. బ్రహ్మ పుర్రె ఆయన చేతికి అతుక్కుపోయి విడిపోలేదు. ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి కాలభైరవుడు మూడు లోకాల్లో సంచరించాడు. చివరకు కాశీ క్షేత్రంలోని కపాలమోచన తీర్థానికి చేరుకోగానే ఆయనకు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శివుడు కాలభైరవుడిని కాశీ నగరానికి రక్షకుడిగా నియమించాడు. అప్పటి నుంచి ఆయనను ‘కాశీ కొత్వాల్’గా పిలుస్తున్నారు. ఆయన చేతిలో దండం ఉండటం వల్ల దండపాణి అని కూడా అంటారు. కుక్క ఆయన వాహనంగా ప్రసిద్ధి చెందింది.
కాలభైరవ జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని, కాలభైరవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. స్వామివారి ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించి ‘ఓం కాలభైరవాయ నమః’ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. వీలైనవారు కాలభైరవ అష్టకం పారాయణం చేయవచ్చు. అలాగే నల్ల కుక్కకు రొట్టెలు లేదా ఆహారం పెట్టడం ఈ రోజు పాటించే సంప్రదాయాల్లో ఒకటి. ఇలా చేయడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభించి భయాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున భక్తులు కాలభైరవుడిని ఆరాధిస్తూ తమ జీవితాల్లో సుఖశాంతులు, ధైర్యం, రక్షణ కలగాలని ప్రార్థిస్తారు.
(Disclaimer: ఈ కథనం హిందూ పురాణాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. ఇందులో పేర్కొన్న అంశాలు భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి మాత్రమే.)
మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.