
కావలసిన పదార్థాలు: లేత బెండకాయలు – పావుకిలో, పండిన ఎర్ర టమాటాలు – 4 మీడియం సైజు, ఎండుమిరపకాయలు – 10 నుండి 12, ధనియాలు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, చింతపండు – నిమ్మకాయ సైజు, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 12, ఉల్లిపాయ – 1 పెద్ద సైజు, తాజా కరివేపాకు – 1 పిడికెడు, తాలింపు దినుసులు – 1 టేబుల్ స్పూన్, ఇంగువ పొడి – 1 చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, వంట నూనె – 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయాలి. ఇందులో 10-12 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించాలి. ఇందులోనే పిడికెడు కరివేపాకు రెమ్మలు వేసి ఆకులు కరకరలాడే వరకు మాడకుండా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 అంగుళం ముక్కలుగా కోసిన బెండకాయ ముక్కలను వేయాలి. మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెండకాయల్లోని జిగురు పోయి 65 నుండి 70 శాతం వరకు మాత్రమే వేగేలా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో తరిగిన 4 ఎర్ర టమాటాలు, నిమ్మకాయంత చింతపండు వేసి అడుగు పట్టకుండా కలుపుతూ టమాటాలు పూర్తిగా గుజ్జుగా మగ్గే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

శుభ్రమైన రోట్లో ముందుగా వేయించి చల్లార్చిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఆ తర్వాత మగ్గించి చల్లార్చిన టమాటా-చింతపండు గుజ్జు వేసి బాగా నూరాలి. ఇందులో పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి చితగ్గొట్టాలి. ఇప్పుడు వేయించిన బెండకాయ ముక్కలను వేసి మరీ నుజ్జుగా కాకుండా ఒక్క ముక్కగా ఉండేలా దంచాలి. చివరగా 1 పెద్ద ఉల్లిపాయను సగానికి కోసి రోట్లో వేసి రసం బయటకు వచ్చేలా బాగా చితగ్గొట్టి పచ్చడిలో కలుపుకుని బౌల్లోకి తీసుకోవాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆ తర్వాత 3 ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడగానే.. రోట్లో నూరిన బెండకాయ పచ్చడిని పోపులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి నూనెలో పచ్చడి అంతా కలిసేలా గరిటెతో బాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిచూసుకోవాలి.

అంతే, నోరూరించే పల్లెటూరి 'బెండకాయ రోటి పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని, పైనుంచి చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి పోసుకుని కలుపుకుని తింటుంటే.. పచ్చి ఉల్లిపాయ ఘాటు, చింతపండు పులుపు, బెండకాయ కమ్మదనంతో ప్రతి ముద్దా అమృతంలా అనిపిస్తుంది!