
ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, పొట్టలో పేరుకుపోయిన మొండి గ్యాస్, అసిడిటీని బయటకు నెట్టడంలో, అలసట మరియు నీరసాన్ని తగ్గించడంలో, కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో వెలక్కాయ ఒక వరప్రసాదం. అయితే దీనిలోని వగరు, విపరీతమైన పులుపు కారణంగా చాలామంది నేరుగా తినలేరు. అలాంటి వారు సంప్రదాయ రోటి పద్ధతిలో బెల్లం, కారపు మిరపకాయలు, దినుసులు నూరి పచ్చడి చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన వెలక్కాయ రోటి పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: 5 దోర వెలక్కాయలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ గుండు మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 10 నుండి 12 ఎండుమిరపకాయలు, 5 నుండి 6 పచ్చిమిర్చి, పొట్టు విడదీసిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు బెల్లం తురుము, పిడికెడు తాజా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3-4 స్పూన్లు నూనె, అర స్పూన్ ఇంగువ

తయారీ విధానం: వెలక్కాయల పై గట్టి పెంకును పగలగొట్టి, లోపల ఉన్న తెల్లటి/గోధుమ రంగు గుజ్జును స్పూన్‌తో వేరుచేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఒక స్పూన్ నూనె వేడిచేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి లో-మీడియం మంటపై దోరగా వేయించాలి. ఆ వెంటనే ఘాటైన ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మాడకుండా దోరగా వేయించి చల్లారనివ్వాలి.

రోట్లో మొదట వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, పప్పుల మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా నూరాలి. ఇప్పుడు అసలైన వెలక్కాయ గుజ్జు మరియు 2 స్పూన్ల బెల్లం వేసి బాగా దంచాలి. వెలగపండు జిగురుగా ఉండటం వల్ల కాస్త గట్టిపడుతుంది; కాబట్టి కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ రుబ్బుకుంటే పచ్చడి మృదువుగా, జిగురు లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది.

కడాయిలో రెండు గరిటెల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు అర స్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగాక నూరిన వెలక్కాయ పచ్చడిని వేసి స్టవ్ కట్టేయకుండా.. లో ఫ్లేమ్‌పై 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడకనివ్వాలి. అంతే, నోరూరించే వెలక్కాయ రోటి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, జొన్న రొట్టెతో తిన్నా అమృతంలా ఉండటమే కాకుండా పొట్టలోని సమస్త రుగ్మతలను నయం చేస్తుంది.