
టీటీడీ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలో ఉద్యానవనాల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగించబోతోంది. ఏఐ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించింది.

భవిష్యత్తులో ఏఐ సహకారంతో తిరుమలలోని ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు.తిరుమలలో మొత్తం 34 ఉద్యానవనాలు ఉన్నాయని, అందులో 20 ఉద్యానవనాలను దాతలు నిర్వహిస్తుండగా, మరో 14 ఉద్యానవనాలను టీటీడీ నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఉద్యానవనాల నిర్వహణలో ఏఐ భాగస్వామ్యంతో వాటిని మరింత అందంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

ఇక తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్‌ను వినియోగించిన టీటీడీ భక్తుల మన్ననలు పొందింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో పుష్పాలంకరణలు చేపట్టేందుకు దాదాపు 30 మంది దాతలు ముందుకు వచ్చారని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

దాతల సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో తిరుమలలో అత్యంత శోభాయమానంగా పుష్పాలంకరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల తొలిరోజు, గరుడసేవ రోజు, ఏడో రోజు పుష్పాలంకరణలను మార్చడం జరిగిందన్నారు.

జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్న పిల్లలకు పురాణాలపై ఆసక్తి కలిగేలా 24 రకాల కాన్సెప్ట్‌లతో పుష్పాలంకరణలు చేపట్టినట్లు టీటీడీ పేర్కొంది.