
వృషభం: ఈ రాశికి శని లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల 2027 జూలై వరకు ఈ రాశివారి ఆదాయానికి లోటుండదు. అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది. శని నుంచి ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలు పొందాలన్న పక్షంలో శని జయంతి నాడు వీరు శనికి ప్రదక్షిణలు, పూజాలు చేయడం చాలా మంచిది. ఈ నెల 16 తర్వాత నుంచి శని బలం మరింతగా పెరుగుతున్నందువల్ల ఈ రాశివారికి మరింత యోగప్రదుడుగా మారడం జరుగుతుంది. శనిని తృప్తిపరచడం మంచిది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వచ్చే ఏడాది జూలై వరకు ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు కల్పించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా లభి స్తాయి. తమ లక్ష్యాలను, ఆశయాలను నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అందువల్ల ఈ రాశివారు శనికి తైలాభిషేకం, దానాల ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం మంచిది. రానున్న కాలంలో శని వల్ల మరిన్ని యోగాలు పట్టే అవకాశం ఉంది.

కర్కాటకం: భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. చదువులు, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం కలుగుతుంది. తండ్రి నుంచి సంపద లభిస్తుంది. ఇష్టమైన ప్రదేశాలను, ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇందుకు కృతజ్ఞతగా ఈ రాశివారు శనికి పూజలు, ప్రదక్షిణలు చేయడం మంచిది. శని వీరిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశివారి ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది. ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఉంది. శని అమావాస్య లేదా శని జయంతి రోజున శనికి పూజ చేయించడంవల్ల ఈ రాశివారికి ఉత్తరోత్రా మరిన్ని ధన యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. శనికి ప్రదక్షిణలు చేయడం వల్ల గృహ, వాహన యోగాలు కూడా కలుగుతాయి.

మకరం: రాశ్యధిపతి శని ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వీటన్నిటికీ కృతజ్ఞతగా శనికి పూజలు, ప్రదక్షిణలు చేయడం వల్ల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.