
వృషభం: పంచమంలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని ఈ రాశికి అత్యంత శుభుడైన శనైశ్చరుడు లాభస్థానం నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి.

మిథునం: ఈ రాశికి చతుర్థంలో ఉన్న శుక్రుడికి, దశమంలో ఉన్న శనికి సమసప్తమ దృష్టి ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. శీఘ్ర పురోగతి ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ప్రముఖు లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు కొన్ని చేస్తారు.

కర్కాటకం: ఈ రాశికి తృతీయంలో శుక్రుడికి, భాగ్య స్థానంలో ఉన్న శనికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కెరీర్ పరంగా ఊహించని పురోగతి ఉంటుంది. ప్రయాణాలు, ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. సోదరులతో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.

కన్య: ఈ రాశిలో ఉన్న శుక్రుడిని సప్తమంలో ఉన్న శని వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభాలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఒక సంస్థకు అధిపతి కావడం లేదా ఒక సంస్థను ప్రారంభించడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా సమసిపో తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధించవు.

వృశ్చికం: ఈ రాశికి పంచమంలో ఉన్న శనైశ్చరుడికి, లాభస్థానంలో ఉన్న శుక్రుడికి మధ్య పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి లాభం, భూలాభం, గృహ లాభం కలుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి బాగా ఆస్తి కలిసి వస్తుంది.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని, భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు అనుకోకుండా నెరవే రుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కెరీర్ పరంగానే కాక, కుటుంబపరంగా కూడా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి.