
మేషం: రాశ్యధిపతి కుజుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మిగిలిన సంవత్సరమంతా బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల్లో ఈ రాశివారు తప్పకుండా అంచ నాల్ని దాటే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు వ్యాపార నైపుణ్యాలు, మాటకారితనం కలిగిన ఈ రాశివారు ఈ రంగంలో తప్పకుండా విజయాలు, సాఫల్యాలు సాధించే అవకాశం ఉంది. బిల్డర్లు గానూ, ఇంటీరియర్ డెకొరేటర్స్ గానూ ఎదిగే అవకాశం కూడా ఉంది.

కర్కాటకం: ఈ రాశికి కుజ, రవులు ఈ ఏడాదంతా మరింత అనుకూలంగా మారుతున్నందువల్ల స్థిరాస్తుల క్రయ విక్రయాల రంగంలో ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అపర కుబేర యోగాలు పట్టడంతో పాటు పేరు ప్రఖ్యాతులు బాగా వ్యాపిస్తాయి. గృహ అవసరాలు, సౌకర్యాల కల్పనలో నైపుణ్యం సాధించిన వీరు ఆధునిక పద్ధతులను కూడా అనుసరించే అవకాశం ఉంది. వీరికి ఏప్రిల్రి 14 తర్వాత నుంచి స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో అపారమైన ధన లాభాలు కలిగే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశి రియల్ ఎస్టేట్ రంగానికి సంబందించిన సహజ రాశి అయినందువల్ల ఈ రాశివారు రవి అనుకూలతతో ఈ రంగంలో స్థిరత్వం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇళ్లు, పొలాల అమ్మకం, కొనుగోళ్ల విషయంలో వీరు వచ్చే ఆరు నెలల కాలంలో పోటీదార్ల మీద తప్పకుండా పైచేయి సాధిస్తారు. ఈ రంగంలో వీరికి అనేక పర్యాయాలు దన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. బిల్డర్లుగా కూడా వీరు బాగా రాణించే అవకాశం ఉంది. వీరికి ఆశించిన గుర్తింపు కూడా లభిస్తుంది.

తుల: సహజసిద్ధంగా వ్యాపార లక్షణాలు కలిగిన ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా త్వరలో బాగా రాణించే అవకాశం ఉంది. ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి బాగా అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల వీరు స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. మంచి గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల ద్వారా ప్రస్తుతం వీరు అపర కుబేరులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో పాటు రవి కూడా ప్రస్తుతం అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి మరో ఆరేడు నెలల పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిల్డర్లు గానూ, ఇంటీరియర్స్ డెకొరేటర్స్ గానూ ఎదగడంతో పాటు అపారంగా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 తర్వాత నుంచి వీరికి ఈ రంగంలో పట్టపగ్గాలుండవు. ఎటువంటి పోటీదార్ల మీదయినా విజయాలు సాధిస్తారు.

ధనుస్సు: నాయకత్వ లక్షణాలు, ఉన్నత స్థానాలపై ఆశ, దూరదృష్టి కలిగిన ఈ రాశివారు ఇతర రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల్లో వీరు అంచనాలకు మించి లాభాలు గడించే సూచనలున్నాయి. భారీ లక్ష్యాలు, భారీ ప్రాజెక్టులతో వీరు ఈ రంగంలో రికార్డులు సృష్టించే అవకాశం కూడా ఉంది. బిల్డర్లుగా కూడా ఎదిగే అవకాశం ఉంది. ఈ రంగంలో వీరు ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం వల్ల ఊహించని విజయాలు సిద్ధిస్తాయి.