
ఎండాకాలంలోనే ఎందుకు: పాములు శీతల రక్త ప్రాణులు. అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోలేవు. భూమి లోపల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, అవి ప్రాణరక్షణ కోసం బయటకు వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చల్లదనం కోసం ఇళ్లలోని బాత్‌రూమ్‌లు, వంటగది మూలలు లేదా తోటల్లోకి చేరుతాయి.

స్నేక్ ప్లాంట్: పాములను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంలో స్నేక్ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు అస్సలు పడదు. ఇందులో ఉండే యూజినాల్ అనే రసాయనం పాములకు అసహ్యం కలిగిస్తుంది. వాటి నాసికా రంధ్రాలు చాలా సున్నితంగా ఉండటం వల్ల ఈ వాసన రాగానే అవి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోతాయి.

ఇంటి చుట్టూ స్నేక్ ప్లాంట్ మొక్కలను కుండీల్లో పెంచుకోవాలి. ఒకవేళ మొక్క నాటడం సాధ్యం కాకపోతే వీటటి ఆకులను కోసి, ఒక పల్చని గుడ్డలో కట్టి పాములు వచ్చే అవకాశం ఉన్న డోర్లు లేదా కిటికీల దగ్గర ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా సర్పగంధ మొక్క వాసన పాములను దరిచేరనివ్వదు. బంతి పూల మొక్కల వేర్ల నుండి వచ్చే ఒక రకమైన వాసన పాములకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

కేవలం మొక్కలు నాటడమే కాకుండా మీ ఇంటి పరిసరాలను ఎప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలి. పాత టైర్లు, ఇటుకల కుప్పలు, పనికిరాని సామగ్రి పాములకు ఉత్తమ నివాసాలు. వెంటనే వీటిని తొలగించండి. పాములు మన ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఆహారం. ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే పాములు వచ్చే అవకాశం 80శాతం తగ్గుతుంది.

మీ పెరట్లో గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించండి. పొడవాటి గడ్డిలో పాములు దాక్కుంటే మనకు కనిపించవు, ఇది ప్రమాదకరం. ఇంటి గోడలకు లేదా కిటికీల కింద ఉండే చిన్న చిన్న రంధ్రాలను సిమెంట్‌తో మూసివేయండి.పాములను చంపడం కంటే అవి రాకుండా నివారించడమే ఉత్తమ మార్గం. స్నేక్ ప్లాంట్ వంటి సహజ సిద్ధమైన మొక్కలను పెంచుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వేసవిలో మనం సురక్షితంగా ఉండవచ్చు.