
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చక్కెర మన ఆహారంలో ఒక అంతర్భాగమైపోయింది. ఉదయం తాగే కాఫీ నుంచి రాత్రి తినే స్వీట్ వరకు ప్రతిదీ తీపిమయమే. అయితే ఒక వ్యక్తి పట్టుదలతో ఏడాది పాటు చక్కెరను పూర్తిగా మానేస్తే అతని శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఇటీవల పోషకాహార నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది కేవలం బరువు తగ్గడమే కాదు, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఏడాదిలో 10 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం: బరువు తగ్గాలనుకునే వారికి చక్కెర ఒక పెద్ద శత్రువు. ప్రాసెస్ చేసిన చక్కెర, సోడాలు, మిఠాయిలు పూర్తిగా మానేసి సమతుల్య ఆహారం తీసుకుంటే.. ఏడాదిలో సుమారు 4 నుండి 10 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేవలం చక్కెర మానేస్తేనే సరిపోదు. మిగిలిన ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పని వ్యాయామం తోడైతేనే ఈ ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

శరీరంలో అంతర్గత మార్పులు ఇవే: చక్కెర తీసుకోవడం తగ్గించినప్పుడు శరీరం శక్తిని పొందే విధానమే మారిపోతుంది. చక్కెర మానేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం ఉండదు. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు స్థిరీకరించబడతాయి. శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌పై కాకుండా నిల్వ ఉన్న కొవ్వుపై ఆధారపడుతుంది. ఫలితంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు కరగడం మొదలవుతుంది.చక్కెర తీసుకున్నప్పుడు వచ్చే తాత్కాలిక శక్తి, అది తగ్గినప్పుడు వచ్చే విపరీతమైన అలసట ఉండదు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

మానసిక స్థితి - జీర్ణక్రియ: అధిక చక్కెర వినియోగం మానసిక స్థితిలో మార్పులకు కారణమవుతుంది. చక్కెరను దూరం పెడితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

చక్కెరను తగ్గించినప్పుడు ఆ స్థానంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే సంపూర్ణ ఆహారాలను తీసుకోవాలి. అలాగే తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవితం తోడైతేనే చక్కెర రహిత ఆహారం వల్ల పూర్తి ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.