
కావలసిన పదార్థాలు: 1 పెద్ద కప్పు శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, 15 నుండి 18 ఎండు మిరపకాయలు, ఒకటిన్నర చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర , 15 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న రెబ్బ చింతపండు , పావు చెంచా పసుపు , రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా శనగపప్పు, అర చెంచా మినప్పప్పు, అర చెంచా ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వంట నూనె

తయారీ విధానం: ముందుగా కొత్తిమీరను నీటిలో రెండు మూడు సార్లు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచాలి. స్టవ్‌పై పాన్ పెట్టి ఒకటిన్నర చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌పై దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 1 చెంచా నూనె వేసి 15-18 ఎండుమిర్చి వేసి మాడిపోకుండా వేయించాలి. ఎండుమిర్చి వేగాక అందులోనే 15 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు, చిన్న రెబ్బ చింతపండు, పావు చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ తేమతోనే పేస్ట్‌లా నలుగుతుంది, అవసరమైతే ఒక చుక్క నీళ్లు వేసుకోవచ్చు.

కడాయిలో 3 నుండి 4 చెంచాల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపును దోరగా వేయించాలి. ఇందులో మళ్లీ ఎండుమిర్చి వేయకూడదు. పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ-ఎండుమిర్చి పేస్ట్‌ను వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నూనె పైకి తేలే వరకు కలుపుతూ పచ్చివాసన పోయేలా బాగా వేయించాలి.

కారం పేస్ట్ చక్కగా వేగి నూనె తేలిన తర్వాత.. తరిగి పెట్టుకున్న కప్పు తాజా కొత్తిమీరను వేసి కలపాలి. కొత్తిమీర పచ్చివాసన పోయి సాఫ్ట్‌గా మగ్గే వరకు మూతపెట్టి చిన్న మంటపై రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'కొత్తిమీర ఉల్లికారం' సిద్ధం! వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి, ఈ కారం కలుపుకుని పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటుంటే అమృతంలా ఉంటుంది !