
కావలసిన పదార్థాలు: అర కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, 3 యాలకులు, 1 టీస్పూన్ నెయ్యి, ఒక్క చిటికెడు బేకింగ్ సోడా, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్‌లో అర కప్పు బొంబాయి రవ్వ, ఒక యాలక్కాయ వేసి 2 నిమిషాలు కాస్త రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక కప్పు పాలు పోసి ఒక పొంగు రానివ్వాలి. పాలు పొంగిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలపాలి. ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో మ్యాష్ చేస్తూ కలపాలి.

రవ్వ పాలన్నింటినీ పీల్చుకుని ముద్దలా పాన్‌ను వదిలే సమయంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు మూతపెట్టి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి పంచదార కరిగే వరకు మరిగించాలి. ఇందులో దంచిన రెండు యాలకులు వేయాలి. తీగ పాకం అవసరం లేదు; గులాబ్ జామున్ పాకంలా చేత్తో తాకితే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి.

గోరువెచ్చగా ఉన్న రవ్వ ముద్దలో ఒక్క చిటికెడు వంట సోడా వేసి, చేతితో 5 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ సాఫ్ట్ పిండిలా మర్దన చేయాలి. ఆ తర్వాత ఏమాత్రం పగుళ్లు లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా లేదా అందమైన సిలిండ్రికల్ బుల్లెట్ షేప్‌లో చుట్టుకోవాలి. బాండీలో నూనెను మీడియం వేడిలో ఉంచాలి.

తయారుచేసిన బుల్లెట్లను నూనెలో వేసి, వెంటనే కదపకుండా పైకి తేలిన తర్వాత అన్ని వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన వెంటనే గోరువెచ్చని పంచదార పాకంలో వేసి కలపాలి. ఒక గంట పాటు పాకంలో నాననిస్తే రవ్వ స్వీట్లు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. అంతే, ఇంట్లోని పదార్థాలతోనే ఎంతో రుచికరమైన జ్యూసీ రవ్వ స్వీట్ సిద్ధం! పండుగల వేళ ఇంటికి వచ్చే బంధువులకు వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు!