
పరిశోధన ప్రకారం.. క్రమం తప్పకుండా నడిచే వారిలో కేవలం 25శాతం మంది మాత్రమే ఆరోగ్య సంస్థలు సూచించిన సంపూర్ణ వ్యాయామ ప్రమాణాలను అందుకోగలుగుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు ఏరోబిక్ వ్యాయామంతో పాటు, కనీసం రెండు రోజులు కండరాలను బలపరిచే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం ఎంతో ముఖ్యం. నడిచే వారిలో సుమారు 22శాతం మంది ఈ రెండు రకాల వ్యాయామ ప్రమాణాలను సాధించడంలో పూర్తిగా వెనుకబడిపోతున్నారు.

నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎంచుకునే శారీరక శ్రమల్లో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. నగరాల్లో నివసించే వారు రన్నింగ్, సైక్లింగ్, జిమ్, డ్యాన్స్ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో తోటపని, వేట, చేపలు పట్టడం, వ్యవసాయ పనుల ద్వారా శరీరానికి శ్రమ లభిస్తుంది. అయితే జిమ్‌లు లేదా తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాయామం చేయని వారి శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

కేవలం దూరం నడవడం కంటే, శరీరాన్ని సరైన రీతిలో కదిలించడం, బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు తమ రోజువారీ పనులైన తోటపని లేదా బరువైన పనుల్లోనే కండరాలకు శ్రమ కలిగించే పద్ధతులను భాగం చేసుకోవచ్చు. దీంతో పాటు చిన్న చిన్న విరామాలలో చేసే తీవ్రమైన వ్యాయామాలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయి.

ఈ అధ్యయనం 2019 నాటి గణాంకాల ఆధారంగా నిర్వహించినందున, కోవిడ్ అనంతర మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రతి ఒక్కరి జీవనశైలికి సరిపోయేలా ప్రత్యేక వ్యాయామ ప్రణాళికలు రూపొందించడం ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

వ్యాయామం అనేది కేవలం ఎక్కువ సమయం కదలడం మాత్రమే కాదు.. సరైన రీతిలో కదలడం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సాధారణ సమాచారం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని మీకు తగిన వ్యాయామ ప్రణాళికను ఎంచుకోవడానికి మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా సర్టిఫైడ్ ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించడం మంచిది.