
కరివేపాకు మొక్క ఆరోగ్యంగా ఉండాలన్నా.. త్వరగా పెరగాలన్ని దానికి సరిపడ ఎండ అవసరం. చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల ఆకులు బలహీనంగా మారుతాయి. ఈ మొక్కకు రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలేలా చూడాలి. బాల్కనీలో లేదా డాబాపై ఉదయపు ఎండ బాగా తగిలే చోట కుండీని ఉంచండి.

చలికాలంలో మొక్కల నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే కుండీలోని మట్టి కూడా త్వరగా ఆరదు. కాబట్టి కరివేపాకు మొక్కకు నీరు పోసే ముందు కుండీలోని మట్టిని ఒకసారి పరిశీలించండి. పైభాగంలో 1-2 అంగుళాల మేర మట్టి పొడిగా అనిపిస్తేనే నీరు పోయండి. అలాగే నీరు ఎక్కవు అయితే కింద నుంచి బయటకు వెళ్లిపోయేలా కుండి ఒక రంద్రం కూడా చేయండి.

కరివేపాకు మొక్క ఎక్కువ చలిని తట్టుకోలేదు. కాబట్టి రాత్రి వేళల్లో మొక్కను ఆరుబయట కాకుండా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో పెట్టడం మంచిది. బాల్కనీలో మొక్క ఉంటే, నేరుగా చలిగాలి తగలకుండా గోడకు దగ్గరగా ఉంచండి. చలి మరీ ఎక్కువగా ఉంటే మొక్కపై గార్డెనింగ్ కవర్ లేదా ఏదైనా పలుచటి వస్త్రాన్ని కప్పి ఉంచవచ్చు.

కరివేపాకు మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి గుల్లగా, నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోయేలా ఉండాలి. కాబట్టి కుండీలోని మట్టి మరీ గట్టిగా మారితే, అందులో సేంద్రియ ఎరువుతో పాటు కొద్దిగా లావు ఇసుక లేదా పెర్లైట్ కలపండి. దీనివల్ల మట్టిలో గాలి ప్రసరణ బాగా జరిగి, అదనపు నీరు సులభంగా బయటకు వెళ్లిపోతుంది.

మీ ఇంట్లో ఉన్న కరివేపాకు మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే మట్టిలో పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. నెలకు ఒకసారి కొద్ది మోతాదులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్‌ను మట్టిలో వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఏపుగా పెరగడంతో పాటు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది.