
కావలసిన పదార్థాలు: 1 ప్యాకెట్ చేత్తో బాగా నలిపిన సన్న సేమియా, స్వచ్ఛమైన నెయ్యి, 1 గ్లాసు చిక్కటి పాలు, 3 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 నుండి 3 చీజ్ క్యూబ్స్, అర కప్పు నీళ్లు, గార్నిషింగ్ కోసం జీడిపప్పు, బాదం పలుకులు

తయారీ విధానం: సన్న సేమియాను తీసుకుని చేతులతో చిన్న చిన్న ముక్కలుగా పొడిలా నలుపుకోవాలి. ఇందులో తగినంత నెయ్యి వేసి, ప్రతి సేమియాకు నెయ్యి సమంగా పట్టేలా బాగా మిక్స్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా విభజించి పక్కన ఉంచుకోవాలి.

స్టవ్ వెలిగించక ముందే ఒక గిన్నెలో పాలు, 3 చెంచాల పంచదార, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి పంచదార కరిగి ఉండలు లేకుండా విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి స్టవ్ మీద పెట్టి కలిపితే ఉండలు కడతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్‌పై పెట్టి కలుపుతూ ఉండాలి. మిశ్రమం కాస్త చిక్కబడటం ప్రారంభించగానే కట్ చేసిన చీజ్ క్యూబ్స్ వేసి చీజ్ పూర్తిగా కరిగి సాఫ్ట్ క్రీమ్‌లా మారే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి.

మరొక చిన్న పాన్‌లో అర కప్పు పంచదార, అర కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై మరిగించాలి. పాకం ఏమీ రానవసరం లేదు; పంచదార కరిగి కాస్త జిగురుగా మారే వరకు మరిగించి దించి పక్కన ఉంచాలి. ఒక ఫ్రై పాన్ లేదా చిన్న కడాయికి నెయ్యిని బాగా రాయాలి. ముందుగా విభజించి ఉంచుకున్న సేమియాలో మొదటి సగాన్ని పాన్ అడుగున వేసి చేత్తో గట్టిగా నొక్కుతూ సమానమైన బేస్‌లా సర్దాలి. దీనిపై తయారుచేసి పెట్టుకున్న చీజ్-కార్న్‌ఫ్లోర్ క్రీమ్‌ను మధ్యలో వేసి చుట్టూ సమానంగా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన రెండో భాగం సేమియాను పైనుంచి వేస్తూ లోపలి చీజ్ లేయర్ ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా కవర్ చేయాలి.

ఇప్పుడు ఈ పాన్‌ను స్టవ్‌పై పెట్టి చాలా తక్కువ మంటపై (సిమ్‌లో) మూతపెట్టి 8 నుండి 10 నిమిషాలు కాల్చాలి. అడుగు భాగం గోల్డెన్ బ్రౌన్‌గా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్ సహాయంతో రెండో వైపుకు తిప్పి.. మరో 3-4 నిమిషాలు సన్నటి సెగపై కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైభాగంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసి.. ముందుగా కాచి ఉంచుకున్న గోరువెచ్చని పంచదార సిరప్‌ను కునాఫా అంతటా సమంగా పోయాలి. అంతే, క్రిస్పీగా మరియు లోపల చీజీగా ఉండే ట్రెండీ 'కునాఫా' సిద్ధం! వేడివేడిగా కట్ చేసుకుని తింటుంటే స్వీట్ లవర్స్‌కు అద్భుతమైన రుచినిస్తుంది!