
హైడ్రేషన్ విషయంలో దోసకాయ అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో దాదాపు 95శాతం నుండి 96శాతం వరకు నీరు ఉంటుంది. అంటే మీరు ఒక దోసకాయ తింటున్నారంటే, దాదాపు గ్లాసుడు నీటిని ఘన రూపంలో తీసుకుంటున్నట్లే లెక్క. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పుచ్చకాయలో 91శాతం నుండి 92శాతం నీరు ఉంటుంది. దోసకాయ కంటే కొంచెం తక్కువ నీటి శాతం ఉన్నప్పటికీ, దీనిలో ఉండే ఇతర పోషకాలు దీనిని ప్రత్యేకంగా నిలుపుతాయి.

పోషకాల గని: పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ A, C లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని సహజ చక్కెరలు ఎండ వల్ల కలిగే నీరసాన్ని తక్షణమే పోగొట్టి శక్తిని ఇస్తాయి.

దోసకాయ పోషక విలువలు: కేవలం నీరు మాత్రమే కాదు, మన శరీరానికి విటమిన్లు కూడా ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరం. కేలరీలు అతి తక్కువగా ఉండటమే కాకుండా ఎముకల బలానికి అవసరమైన విటమిన్ K ఇందులో పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు గుండె స్పందనను, ద్రవాల సమతుల్యతను కాపాడతాయి.

డైట్‌లో ఏది బెటర్: మధుమేహం ఉన్నవారు: పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవడం మంచిది. దోసకాయలో చక్కెర శాతం చాలా తక్కువ కాబట్టి వారు నిర్భయంగా తినవచ్చు. అంతేకాకుండా దోసకాయలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అయితే పుచ్చకాయను రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకుంటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి పగటిపూట తీసుకోవడమే ఉత్తమం.

ఏది ఎంచుకోవాలి?: మీరు బరువు తగ్గాలి, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే దోసకాయను ప్రాధాన్యత ఇవ్వండి. అలా కాకుండా ఎండలో తిరగడం వల్ల వచ్చిన అలసట పోవాలి, తక్షణ శక్తి కావాలి అనుకుంటే పుచ్చకాయను ఎంచుకోండి. నిజానికి, ఈ రెండింటినీ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ వేసవి తాపం నుండి పూర్తి రక్షణ పొందవచ్చు.