
కావలసిన పదార్థాలు: నానబెట్టిన చిన్న మిల్ మేకర్స్ – 2 కప్పులు, పచ్చికొబ్బరి ముక్కలు – 1 కప్పు, శెనగపిండి – 1 కప్పు లేదా జొన్నపిండి/గోధుమపిండి, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, 1 మీడియం క్యారెట్ క్యారెట్ తురుము, 1 అంగుళం ముక్క అల్లం తురుము, తాజా కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన 2 రెమ్మల తాజా కరివేపాకు, వాము – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, గరం మసాలా పొడి – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, పుట్నాల పప్పు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె.

తయారీ విధానం: ఒక గిన్నెలో 1 కప్పు చిన్న మిల్ మేకర్‌లను తీసుకుని మరిగే వేడి నీళ్లు పోసి 10 నిమిషాలు నాననివ్వాలి. సైజు రెట్టింపు అయిన తర్వాత చేత్తో గట్టిగా పిండి నీరు చుక్క లేకుండా సపరేట్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో నానిన 2 కప్పుల మిల్ మేకర్, 1 కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి నీళ్లు పోయకుండా పల్స్ మోడ్‌లో 4-5 సార్లు బరకగా పొడిపొడిలాడేలా గ్రైండ్ చేసి బౌల్‌లోకి తీసుకోవాలి.

ఈ కొబ్బరి-సోయా మిశ్రమంలో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి తరుగు, 1 క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇందులోనే 1 కప్పు శెనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, అర టీస్పూన్ వాము, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ ధనియాల పొడి, అల్లం తురుము మరియు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నీళ్లు పోయకుండా కొబ్బరి, మిల్ మేకర్‌లోని తేమతోనే చేత్తో గట్టి ముద్దలా కలుపుకోవాలి.

చేతిని కొద్దిగా నీటితో తడుపుకుని పిండి నుండి నిమ్మకాయంత ముద్ద తీసుకుని అరచేతిలో గుండ్రటి వడలా ఒత్తుకోవాలి. కొన్ని వడలను అలానే ఉంచి, మరికొన్నింటికి ఒకవైపు పుట్నాల పప్పులో అద్ది తేలికగా నొక్కాలి. ఒత్తిన వడలను ఒక శుభ్రమైన తడి కాటన్ క్లాత్‌పై ఉంచుకుంటే నూనెలో వేసేటప్పుడు సులభంగా వస్తాయి.

హెల్దీ షాలో ఫ్రై పద్ధతి: స్టవ్‌పై నాన్‌స్టిక్ పాన్ పెట్టి 1½ టేబుల్ స్పూన్ నూనె రాసి వేడిచేయాలి. పుట్నాల పప్పు లేని వడలను పాన్‌లో అమర్చి లో ఫ్లేమ్ (సిమ్) లో నిదానంగా 3 నిమిషాలు కాల్చి, రెండో వైపుకు తిప్పి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి. క్రిస్పీ డీప్ ఫ్రై పద్ధతి: కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత పుట్నాల పప్పు అతికించిన వడలను వేయాలి. మీడియం మంటపై రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా, కరకరలాడే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్‌పైకి తీసుకోవాలి.

అంతే, నోరూరించే క్రిస్పీ 'పచ్చికొబ్బరి మిల్ మేకర్ వడలు' సిద్ధం! వేడివేడిగా టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో నంజుకుని తింటుంటే.. బయట బండి మీద మసాలా వడల్లా కరకరలాడుతూ, లోపల పచ్చికొబ్బరి కమ్మదనంతో పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు!